ముంబై ప్రజలకు చిరుతపులుల అండ - MicTv.in - Telugu News
mictv telugu

ముంబై ప్రజలకు చిరుతపులుల అండ

March 10, 2018

ముంబై నగరంలో వీధి కుక్కలు ప్రజలకు కంటకంగా మారాయి. వాటికి కంటకంగా చిరుతపులులు మారాయి. 104 చదరపు కిలోమీటర్లు విస్తరించిన సంజయ్‌ గాంధీ నేషనల్‌ పార్క్‌లోంచి అప్పుడప్పుడు పులులు తప్పించుకొని జనావాస ప్రాంతాల్లోకి వచ్చి దొరికిన కుక్కనల్లా పట్టుకెళ్లి తింటున్నాయట. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇళ్ళనుంచి బయటకు రాకుండా వుంటున్నారు. జూలో వాటికి నిత్యం కుక్క మాంసమే పెడుతుండటంతో అవి కుక్క మాంసానికి మరిగి జనావాసాల్లోకి వస్తున్నాయి. వాటివల్ల జనాలకు ఏం ఇబ్బంది లేదని.. వాటివల్ల జనావాసాలకు మేలే జరుగుతుందని  ‘ ఫ్రాంటయిర్స్‌ ఇన్‌ ఎకాలజీ అండ్‌ ది ఎన్విరాన్‌మెంట్‌ ’ పత్రికలో ప్రచురితమైంది.

జూలో 42 చిరుత పులులు ఉన్నాయి. వాటి ఆహారంలో భాగంగా జూ సిబ్బంది వాటికి కుక్క మాంసం పెడుతోంది. ముంబై నగరంలో రోజురోజుకీ వీధి కుక్కల సంఖ్య ఎక్కువ అవుతోంది. ముంబై నగరం మొత్తం మీద ఏ రోజున లెక్కించిన సరాసరి 95 వేల వీధి కుక్కలు ఉంటాయన్నది ఓ అంచనా. వీటి వల్ల ఏటా ప్రజలకు 75 వేల గాయాలు అవుతున్నాయి. ఇవి అధికారికంగా నమోదయిన గాయాలు మాత్రమే. నమోదు కాకుండా కూడా మరికొన్ని వేల గాయాలవుతున్నాయన్నది అంచనా. పార్క్‌ సమీపంలో ఏడాదికి 800 నుంచి రెండువేల వీధి కుక్కలు చిరుత పులులకు ఆహారంగా మారుతున్నాయని, తద్వారా ముంబై నగరంలో వీధి కుక్కలు అదుపులో ఉంటున్నాయని పాపులేషన్‌ బయోలజిస్ట్‌ లెక్స్‌ ఐబీ, వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన సర్వేయర్‌ నికిత్‌ చేసిన తాజా అధ్యయనంలో తేలింది.

రేబిస్ వ్యాధి సోకి వందల మంది మరణిస్తున్నారు. అధికారికంగా నమోదైన లెక్కల ప్రకారం గత 20 ఏళ్లలో నగరంలో వీధి కుక్కల గాయాల వల్ల 420 మంది మరణించారు. చిరుతపులులు, వీధికుక్కలను వేటాడటం వల్ల మున్సిపాలిటీకి ఏటా రూ. 8 లక్షలు మిగులుతున్నట్టు తేల్చారు.

ఒకవేళ ఆ పార్క్‌ను తీసివేస్తే పట్టణీకరణ పెరిగి, అటవీ ప్రాంతం తరిగిపోతుంది. తద్వార వీధికుక్కలు మరింత పెరిగే అవకాశం వుంది. పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుంది. 2002లోనే 25 మంది చిరుత పులుల కారణంగా మృత్యువాత పడ్డారు. ఆ సంఘటనలపై దర్యాప్తు జరపగా ఇతర పార్కుల నుంచి నేషనల్‌ పార్కుకు తరలించిన చిరుతల వల్లనే ఆ దాడులు జరిగాయని తేలింది. పార్క్‌లో ఉన్న చిరుతలు పూర్తిగా కుక్కల ఆహారానికే అలవాటు పడ్డాయి. గత నాలుగేళ్లుగా చిరుతల కారణంగా ఒక్కరు కూడా ఇక్కడ మృత్యువాత పడకపోవడం కూడా ఈ విషయాన్ని నిరూపిస్తోంది.