మోదీకి దక్షిణాది దెబ్బ రుచేంటో చూపిద్దాం - MicTv.in - Telugu News
mictv telugu

మోదీకి దక్షిణాది దెబ్బ రుచేంటో చూపిద్దాం

March 23, 2018

‘రండి.. దక్షిణాది దెబ్బ ఎలా వుంటుందో మోదీకి రుచి చూపిద్దాం ’ అని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కర్ణాటక సీఎం, కాంగ్రెస్ నేత  సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల పవరేంటో ప్రధానికి తెలిసేలా చేద్దామని ట్విటర్లో పిలుపునిచ్చారు. ఆయా రాష్ట్రాల సీఎంలతో సహా ఈ ట్వీట్‌ను డీఎంకే నేత స్టాలిన్, కాంగ్రెస్ నేత శశి థరూర్‌లకు కూడా ట్యాగ్ చేశారు.

15వ ఆర్థిక సంఘం నిధుల పంపిణీకి 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకోవడాన్ని సిద్దరామయ్య తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పటివరకు 1971 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకునే నిధుల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. 1971 తరువాత బిహార్,  ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా గణనీయంగా పెరిగిపోయింది.

బెంగాల్‌లో బంగ్లాదేశ్, రోహింగ్యాలు అక్రమంగా చొరబడ్డారని గతంలో పలు వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో 2011 జనాభా లెక్కల ప్రకారం నిధుల పంపిణీ జరిగితే ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ లబ్ది పొందుతాయి. దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించిన సిద్దరామయ్య, దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి ఈ నిర్ణయాన్ని ప్రతిఘటించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ముస్లింల జనాభా గణనీయంగా పెరిగిపోయిందని ఆ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించిన బీజేపీ నేతలే ఆరోపించిన సంగతి తెలిసిందే.