ఈ పోలీసమ్మకు ఓ షేరేస్కోండి - MicTv.in - Telugu News
mictv telugu

ఈ పోలీసమ్మకు ఓ షేరేస్కోండి

February 16, 2018

శాంతి భద్రతలను రక్షించడమే పోలీస్ బాధ్యత అనుకోవడమే కాదు.. ప్రజల ప్రాణ రక్షణ కూడా తన బాధ్యత అనుకున్నది ఈ లేడీపోలీస్. ఈమె చూపిన చొరవతో ఓ బిడ్డ తల్లి లేని అనాథ కాకుండా పోయింది. గుండెనొప్పి వచ్చి సొమ్మసిల్లి పడిపోయిన ఓ మహిళను వికారాబాద్ డీఎస్పీ శిరీష రాఘవేంద్ర తానే స్వయంగా ఆసుపత్రికి తీసుకువెళ్ళి ఆమె ప్రాణాలు కాపాడింది.

బాధిత మహిళకు ప్రాణదాతగా మారింది. మానవత్వానికి మచ్చు తునకగా మారిన ఈ ఘటన మేడారం జంపన్నవాగు దగ్గర జరిగింది. ఫిబ్రవరి 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్‌కు చెందిన సావిత్రి అనే మహిళా భక్తురాలు తన భర్త బిడ్డతో కలిసి మేడారం జాతరకు వెళుతోంది. దారి మధ్యలో జంపన్నవాగు దగ్గర ఆమెకు ఒక్కసారిగా గుండెనొప్పి వచ్చింది. అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. భర్త, బిడ్డకు ఏం అర్థంకాక ఏడ్చేస్తున్నారు.

ఫుట్‌పాత్ పెట్రోలింగ్‌లో వున్న డీఎస్పీ శిరీష  వాళ్ళని చూసి వెంటనే స్పందించింది. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లింది సావిత్రి. నీళ్ళు తాగిస్తే ఇంకా ప్రమాదమనుకొని, జనాల్లో ఎక్కడెక్కడో వున్న ముగ్గురు కానిస్టేబుళ్ళను ( మల్లేష్, మహేందర్, పెంటయ్య )  వాకీటాకీలో మాట్లాడి వెంటనే ఘటనా స్థలికి రప్పించింది. 104 కు ఫోన్ చేసింది కానీ అది అందుబాటులో లేదు. ఆలస్యం చేస్తే ఆమె ప్రాణాలకు ప్రమాదం అనుకొని అక్కడికి కాస్త దూరంలో వున్న ఒక ఆసుపత్రికి తీసుకువెళ్ళారు చేతులమీదే.

ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోంది ఆ ఆసుపత్రిని. డాక్టర్ వెంటనే ఆమెకు చికిత్స ప్రారంభించాడు. చికిత్స మొదలైన కొద్ది సేపట్లోనే ఆమె కోలుకుంది.  వైద్యులు చికిత్స చేసి ప్రాణాపాయం లేదని, సకాలంలో ఆసుపత్రికి తీసుకురావటం వల్లే ఆమె ప్రాణాలు కాపాడగలిగామని వైద్యులు వివరించారు. ఆమె ఊపిరి పీల్చుకోగానే అక్కడున్న అందరూ చల్లగా ఊపిరి పీల్చుకున్నారు.

కాగా బాధితురాలు సావిత్రికి కొన్ని రోజుల ముందే హార్ట్ సర్జరీ జరిగిందని భర్త తెలిపాడు. సమయానికి డీఎస్పీ శిరీష స్పందించకపోయుంటే సావిత్రి ప్రాణాలు గాల్లో కలిసేవని ఆమె భర్త, కూతురు డీఎస్పీ శిరీషకు కృతజ్ఞతలు తెలిపారు. వారు అమ్మవార్ల దర్శనం చేసుకునే వరకు దగ్గరుండి మరీ చూసుకున్నారు డీఎస్పీ శిరీష. వారు ఊరెళ్ళేముందు బస్సు దాకా వెళ్ళి బస్సు కూడా ఎక్కించారు. కాగా డీఎస్పీ శిరీష చూపిన చొరవకు ఆమె మానవతా హృదయాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.