ఏనుగు, సైకిల్ మధ్య కుదిరిన పొత్తు…. యూపిలో కీలక  రాజకీయ పరిణామం

దేశ రాజకీయాలను ప్రభావితం చేసే యూపిలో కీలక మార్పు చోటు చేసుకున్నది. ఇన్నాళ్లు పరస్పర విమర్శలు చేసుకున్న ఎస్పీ, బిఎస్పీ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. బెహన్ జీ మాయావతే తమ ప్రధానమంత్రి అభ్యర్థని ఎస్పీ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంకేతాలిచ్చారు. త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని వీరిద్దరూ సంయుక్త మీడియా సమావేశంలో వెల్లడించారు.

అత్యధిక ఎంపీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ కొత్త రాజకీయ సమీకరణకు దారి చూపించే అవకాశాలు కన్పిస్తున్నాయి. గతంలో ఈ రెండు పార్టీలు కాంగ్రెస్, బిజెపిలకు మద్దతునిచ్చాయి. ఈసారి మాత్రం కాంగ్రెస్ యేతర, బీజేపీ యేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము సిద్దమనే విషయాన్ని చెప్పకనే చెప్పాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు అంటీ ముట్టనట్లుగా వ్యవహరించాయి.

Telugu News Live Updates Alliance With Akhilesh Yadav Will Leave Modi-Shah Sleepless Says Mayawati .

ఐదు రాష్ట్రాలో బహుజన్ సమాజ్ పార్టీ వీలున్న చోట్ల సొంతంగా పోటీ చేసింది. చత్తీస్‌ఘడ్‌లో స్థానిక పార్టీతో పొత్తులు పెట్టుకున్నది. తాను పోటీ చేసిన దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఖాతా తెరించింది బిఎస్పీ. అదే ఊపులో దక్షిణాది రాష్ట్రాల్లోనూ బలమైన అభ్యర్థులను దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో  సీట్ల పరంగా కీలక పాత్ర పోషించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. యూపిలో యోగీ సీఎం అయిన తర్వాత అధికార బీజేపీకి కొత్తగా కలిసి వచ్చిన అంశాలంటూ ఏమీ లేవు. పైగా తన స్థానాలనే ఉప ఎన్నికల్లో కోల్పోయింది. దానికి తోడు ఈ రాష్ట్రానికి చెందిన రెండు ప్రధాన పార్టీలు పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తే కమలం పార్టీకి కష్టాలు తప్పేలా లేవు.

80 వరకు స్థానాలున్న రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలు కలిస్తే 70 సీట్లు ఖాయమనే అంచనాతో ఉన్నారు ఇరు పార్టీల నాయకులు. వీడీపి సర్వేలో కూడా జాతీయ పార్టీల కంటే ఈ రెండు పార్టీలతో సంబంధం లేని వారే ఎక్కువ సీట్లు గెలుస్తారని స్పష్టం అయింది. యూపి, బిహార్, మధ్యప్రదేశ్, బెంగాల్, తెలంగాణలో బీజేపీకి సానుకూల పరిస్థితులు లేవు. ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా సీట్లు గెలుస్తుందనే నమ్మకమూ లేదు.

ఇక యూపిలో యాభై శాతానికి పైగా ఉన్న బిసిలు, పదిహేడు శాతం వరకు ఉన్న ఎస్సీలు ఈ ఎన్నికల్లో ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉంది. దానికి తోడు జిగ్నేష్ మేవాని లాంటి వాళ్ల ప్రభావం అక్కడ దళిత యువతపై తీవ్రంగా ఉంది. మొన్నటి లోక్‌సభ సమావేశాల్లో దళితులపై పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలని మాయావతి డిమాండ్ చేశారు. అలా దేశవ్యాప్తంగా ఉన్న దళితులను మరోసారి ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు కన్పిస్తున్నది. ఉత్తరాదిన బిజెపికి వెళ్లిన దళిత ఓటు బ్యాంక్‌ను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నది బిఎస్పీ. కాంగ్రెస్ యేతర, బీజేపీ యేతర ప్రభుత్వ ఏర్పాటు నినాదం ఇచ్చిన కేసీఆర్‌కు కాస్త బలం చేకూరినట్లేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Telugu News Live Updates Alliance With Akhilesh Yadav Will Leave Modi-Shah Sleepless Says Mayawati