బతికించలేకపోయిన ఛాయ్ పే చర్చ - MicTv.in - Telugu News
mictv telugu

బతికించలేకపోయిన ఛాయ్ పే చర్చ

December 12, 2017

అధికారంలోకి రావడానికి అరచేతిలో వైకుంఠం చెప్పే రాజకీయ నాయకులు, ఒక్కసారి కుర్చీలో కూర్చోగానే అన్నీ మరిచిపోతారు. గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ దాకా ఎవరిదైనా ఇదే కథ. 2014 ఎన్నికల ప్రచారంలో ఛాయ్ పే చర్చ అంటూ క్యాంపేయిన్ ను జోరుగా చేసిన  నరేంద్రమోడీ, ఆ టైంలోనే నాసిక్ జిల్లా ధబడీ కి  చెందిన యువ రైతు కైలాష్ కిషన్ తో మాట్లాడారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకునే విధర్భ తలరాతను మారుస్తానని కైలాష్ చేతిలో చేయి వేసి మాట ఇచ్చారు. ఆ క్షణం కైలాష్ ముఖంలో ఏదో తెలియని ఆనందం. కళ్లలో ఎక్కడా లేని సంతోషం. ఇక తనతోపాటు వేలాది అన్నదాత బతుకులు మారుతాయని కైలాష్ నమ్మకం పెట్టుకున్నాడు.

మోడీ ఛాయ్ పే చర్చ సూపర్ హిట్ అయింది. ఆయన ప్రధానమంత్రి అయ్యారు. కైలాష్ నమ్మకం బలపడింది. మూడేళ్లు గడిచినయ్. కాని మోడీ చెప్పినట్టు రైతుల పరిస్థి ఏం మారలేదు. దేశంలోని మిగతా అన్నదాతల లెక్కనే తన ఆర్థిక పరిస్థితి కూడా రానురాను దిగజారింది. వేసిన పంటకు గిట్టుబాటు ధర రాలేదు. పెట్టిన పెట్టుబడి తిరిగిరాలేదు. అప్పు పెరిగింది. దీంతో పాటే మోడీపై పెట్టుకున్న విశ్వాసం విరిగిపోయింది. కైలాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. మోడీ ఛాయ్ పే చర్చ తర్వాత ఆత్మహత్య చేసుకున్నవారిలో కైలాష్ రెండోవాడు.

తనతో చర్చించిన యువరైతుకే భవిష్యత్ పై మోడీ భరోసా కల్పించేకపోయారు. ఇక నూరుకోట్ల మందికి ఏం నమ్మకం కలిగిస్తారన్న  విమర్శలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.