లండన్ లో సిరిసిల్ల జెండా  - MicTv.in - Telugu News
mictv telugu

లండన్ లో సిరిసిల్ల జెండా 

September 11, 2017

  

ఇంగ్లండ్ రాజధాని లండన్ లో భారత 70వ స్వతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత్ లోని వివిధ రాష్ట్రాల నుంచి పలువురు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని భారత హైకమిషన్ నిర్వహించింది. ఇందులో తెలంగాణ ఎన్నారై ఫోరమ్ కూడా పాల్గొంది. ఈ సందర్భంగా తెలంగాణ సిరిసిల్ల నేతన్నలు నేసిన అతిపెద్ద త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. దీని 50మీటర్ల పొడవు, 1.3 మీటర్ల వెడల్పు ఉన్న పతాకాన్ని భారత హైకమిషనర్ వైకే సిన్హా ఆవిష్కరించారు. వేడుకలకు యూకే నలుమూలాల నుంచి వేలాది మంది ప్రవాస భారతీయులు తరలివచ్చారు. ‘చేనేతకు చేయూతనిద్దాం.. నేతన్నకు మద్దతునిద్దాం..’ అని తెలంగాణ ఎన్నారైలు నినదించారు. ఎన్నారై ఫోరం తెలంగాణ ప్రముఖులు, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు, తెలంగాణ ప్రత్యేకతలతో తెలంగాణ చారిత్రక పుస్తక ప్రదర్శనతో ప్రత్యేకంగా తెలంగాణ స్టాల్ ని ఏర్పాటు చేసింది.

భారత హైకమిషనర్ వైకే సిన్హా మాట్లాడుతూ….. ‘అంతరించి పోతున్న చేనేత కార్మికులకు అడంగా ఉండడం మన బాధ్యత ’ అని చెప్పారు. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అనుకూల పరిస్థితుల గురించి తెలియజేయడం, తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తున్న తీరు తెన్నుల గురించి గమనించామని తెలిపారు. తెలంగాణ స్టాల్ లో హైదరాబాద్ బిర్యానీ ని అతిథులకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థపకుడు గంప వేణు, అధ్యక్షుడు సిక్క చంద్రశేఖర్ గౌడ్, అడ్వైసరీ చెర్మన్ ప్రమోద్ అంతటి, ప్రధాన కార్యదర్శి గోలి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.