ప్రేమించి పెళ్లి చేసుకుని ఆనందంగా గడపాల్సిన ఓ జంట వేధింపులతో కాలం వెళ్లదీస్తోంది. ఇంట్లో వారు పెట్టె హింసను తట్టుకోలేక చివరకు ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కలిసి పోలీసుల వద్దకు వద్దకు చేరుకొని ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయారు. దీంతో పోలీసులు, స్థానికులు అడ్డుకున్నారు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన కర్ణాటకలో సోమవారం చోటు చేసుకుంది.
హేమంత్ కుమార్(22), చైత్ర(20) తొమ్మిది నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కులాలు వేరుకావడంతో ఇరువురు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో వేరే ఇంట్లో కాపురం పెట్టారు. ప్రస్తుతం చైత్ర గర్భవతి. దీంతో ఆమెను హేమంత్ కుమార్ తన ఇంటికి తీసుకెళ్లాడు. వీరి పెళ్లి ఇష్టంలేని హేమంత్ తండ్రి శ్రీనివాస్, తల్లి మునిరత్నమ్మ, తమ్ముడు కార్తీక్ చైత్రను వేధించడం మొదలు పెట్టారు. దీనిపై చైత్ర పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో.. మంగళవారం ఈ జంట పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. అనంతరం చైత్ర మాట్లాడుతూ.. తన అత్తమామ, మరిదిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.