ప్రేమికుల ఆత్మహత్య.. వారి ప్రేమకు చదువు అవరోధమైంది.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమికుల ఆత్మహత్య.. వారి ప్రేమకు చదువు అవరోధమైంది..

March 22, 2018

ప్రేమకు ఎలాంటి సరిహద్దులు వుండవంటారు కానీ అది ఒట్టి అబద్ధమని పదేపదే నిరూపితమవుతూనే వుంది. కులం, మతం, ప్రాంతీయ విబేధాలు సోకి ఎన్నో ప్రేమలు కాష్టంలో కాలిపోతున్నాయి. కానీ ఈ ప్రేమకు చదువు అవరోధంగా మారింది. అబ్బాయి తక్కువ చదువుకున్నాడని పెద్దలు వారి ప్రేమను ఆమోదించలేదు. కలిసి బతకలేం కాబట్టి కలిసి చచ్చిపోదామని నిర్ణయించుకుని ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో కలకలం రేపుతోంది. ఆనందపురం మండలంలోని గుడిలోవ విజ్ఞాన విహార పాఠశాలకు సమీపంలోని జీడి తోటలో శ్రీను (32), రేవతి (28) విగత జీవులుగా మిగిలారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామానికి చెందిన యర్రంశెట్టి హరిబాబు అలియాస్‌ శ్రీను, బంటు రేవతి ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. హరిబాబు ఇంటర్‌ వరకు చదువుకున్నాడు. రేవతి డీ ఫార్మశీ చేసింది. నర్సీపట్నంలోని మెడికల్ షాపులో నాలుగేళ్ళుగా పనిచేస్తూ ఎం ఫార్మశీ చదువుతోంది.ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరి ప్రేమకు కులాలు అడ్డుకాలేవు. పైగా ఇరు కుటుంబాలకు బంధుత్వం వుంది.

శ్రీను తల్లిదండ్రులు రేవతి పెద్దల వద్దకు వెళ్లి పెళ్లి విషయం మాట్లాడారు. చదువు తక్కువని, చిన్న ఉద్యోగమని రేవతి తరుపు పెద్దలు నిరాకరించారు. దాంతో గతేడాది శ్రీను తల్లిదండ్రులు కోటవురట్ల మండలం కలవలపూడి గ్రామానికి చెందిన యువతితో వివాహం చేశారు. శ్రీను పెళ్ళి జరిగినా రేవతిని మరిచిపోలేకపోయాడు. వారి మధ్య అనుబంధం కొనసాగుతూనే వుంది. ఈ విషయం తెలిసి ఇరుకుటుంబాల నడుమ గొడవలు మొదలయ్యాయి. ఇద్దరూ ఇంకెప్పుడూ కలుసుకోకూడదు, మాట్లాడుకోకూడదని ఆంక్షలు విధించారు. దీంతో ఇద్దరూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

కలిసి చనిపోదామనుకున్నారు :

పెద్దలు వారిని కలిసి బతకనివ్వరు కాబట్టి కలిసి చచ్చిపోదామని నిర్ణయించుకున్నారు. ఈనెల 17న శ్రీను నర్సీపట్నంలో రేవతి పనిచేస్తున్న మెడికల్‌ షాపు వద్దకు వెళ్లి ఆమెను మోటార్‌బైక్‌పై ఎక్కించుకొని వెళ్లాడు. ఇద్దరూ ఎక్కడికైనా పారిపోయారేమో అనుకొని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా గుడిలోవ కొండ ప్రాంతంలోని జీడి తోటలో ఇద్దరు యువతీ యువకులు ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉండడాన్ని గమనించిన పశువుల కాపర్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. అక్కడ లభ్యమైన బ్యాగ్‌లోని గుర్తింపు కార్డుల ఆధారంగా వారు శ్రీను, రేవతిలుగా గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారి మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని ఇద్దరి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.  మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలోనే మృతుడి బైక్, మృతురాలి హ్యాండ్‌ బ్యాగ్‌, కూల్‌‌డ్రింక్‌ బాటిళ్లు, చిప్స్‌ ప్యాకెట్లు లభ్యమయ్యాయి.

రేవతి మరణంపై అనుమానాలు :

రేవతి మృతదేహం నేలపై పడివుండటంతో ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీను రేవతి చున్నీతో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఇద్దరి మృతదేహాలు బాగా ఉబ్బి ఉండడంతో ఆత్మహత్యకు పాల్పడి మూడు రోజులై ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. తమ మృతదేహాలను ఒకేచోట దహనం చేయాలని మృతులు ఫోన్‌లో వారి స్నేహితులకు మెసేజ్‌లు పంపినట్టు తెలుస్తోంది. కలిసి బతకలేక చనిపోయిన ఆ ప్రేమికుల మృతదేహాలను చూసి గ్రామస్థులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.