ప్రేమపెళ్లి.. మరుసట్రోజే  హ్యాండిచ్చింది.. చావబోయాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమపెళ్లి.. మరుసట్రోజే  హ్యాండిచ్చింది.. చావబోయాడు..

February 23, 2018

ఇద్దరూ ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ ఒకటే వీధి, ఇద్దరిదీ ఒకే మతం. పెద్దలు ఒప్పుకోరేమోననే భయంతో రహస్యంగా పెళ్ళి చేసుకున్నారు. తరువాత ఏమైందో అమ్మాయి ప్లేటు ఫిరాయించింది. కట్టుకున్న భర్తను ఎవరో తనకు తెలియదంది. ఆమె మాటలకు తీవ్ర మనస్తాపం చెందిన యువకుడు బస్సు కింద పడి చనిపోదామని ప్రయత్నించాడు. పోలీసులు, స్థానికులు అతణ్ణి కాపాడారు. ఈ ఘటన విజయవాడ చిట్టినగర్‌లోని కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

విజయవాడలోని వించిపేట ఏనుగుల వారి వీధిలో నివాసం వుంటాడు ఖాజావలి అలియాస్ అనాస్. అతను ప్లాస్టిక్ డిస్పోజల్ వ్యాపారం చేస్తాడు. తనుంటున్న అదే వీధిలోని యువతిని కొంత కాలంగా ప్రేమించాడు. తమ వివాహానికి పెద్దలు ఒప్పుకోరని ఇంట్లోంచి పారిపోాయారు.కొండపల్లిలోని ఖాజీ మసీదులో వివాహం చేసుకున్నారు. కాగా తమ కుమార్తె కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు అమ్మాయి తల్లిదండ్రులు. అనాస్‌ ఆ యువతి కలిసి పోలీసు కమిషనరేట్‌లో ఉన్నతాధికారులను కలిసి తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఇద్దరూ తమ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నామని పోలీసులకు తెలిపారు.  ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ తగిన దృవీకరణ పత్రాల గురించి అడగగా అవాస్ తన ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్ చూపించాడు. అమ్మాయిది జిరాక్స్ కాపీ చూపించాడు.

దీంతో తమ కుమార్తె మైనరేనని, అతనేదో మాయ చేసి తమ అమ్మాయిని బలవంతంగా తీస్కెళ్లి పెళ్లి చేసుకున్నాడని ఆమె తల్లిదండ్రులు వాదించారు. పోలీసులు ఒరిజినల్‌ తీసుకురావాలని కోరారు. ఆమెను తల్లిదండ్రులకు అప్ప గించారు. అనాస్‌ మీసేవా కేంద్రం నుంచి యువతి జనన ధ్రువపత్రాన్ని తీసుకొచ్చి గురువారం పోలీసులకు సమర్పించాడు. ఆ యువతిని పోలీసులు మళ్ళీ  స్టేషన్‌కు పిలిపించారు. యువతి అభిప్రాయం కోరగా.. అమ్మాయి ఒక్కసారిగా మాట మార్చింది. అవాస్ అంటే తనకు తెలియదంది. ఊహించని ఆమె మాటలు విన్న అనాస్ ఒక్కసారిగా పెద్దగా కేకలు వేసుకుంటూ రోడ్డు మీదకు పరుగెత్తి బస్సు కింద పడదామని ప్రయత్నించాడు.

పోలీసులు, బంధువులు అతణ్ణి  పక్కకు లాగటంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు.