mictv telugu

మరణాన్ని, పెద్దలను జయించిన ప్రేమికులు.. ఆస్పత్రిలోనే నిఖా…

January 11, 2019

తమ గుండెలోని ప్రేమను జయించడానికి ఆ ప్రేమికులు మరణం అంచులదాకా వెళ్లొచ్చారు. కఠినంగా మారిన పెద్దల మనసు మార్చలేక తామే ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలనుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు పురుగుల మందు తాగారు. ఆస్పత్రిలో మూడు రోజులు మృత్యువుతో పోరాడి గెలిచారు. కానీ వారి ప్రేమ వారిని చావనివ్వలేదు. పెద్దల మనసు మార్చింది. పెళ్లితో ఒక్కటయ్యారు. ఆస్పత్రిలోనే వారి నిఖా జరిగింది. యుద్ధం చేసినట్టు వారి ప్రేమను జయించారు. వివరాల్లోకి వెళ్తే..  

వికారాబాద్‌ జిల్లా, ధారూర్‌ మండలం కుక్కిందకు చెందిన రేష్మాబేగం(20), అక్కను వికారాబాద్‌ మండలం అత్వెల్లికి చెందిన నవాజ్‌(23), అన్నకు ఇచ్చి పెళ్లి చేశారు. కాగా, వీరి పిల్లలను ఆడించడానికి చుట్టం చూపుగా అక్క ఇంటికి వచ్చేది రేష్మ. ఈ క్రమంలో నవాజ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల్లోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. సరిగ్గా ఇక్కడే వచ్చింది సమస్య. అన్ని ప్రేమకథల్లోలానే వారి ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు. కారణం ఒకే ఇంటికి ఇద్దరు అక్కాచెళ్ళెళ్ళను ఇవ్వలేమని రేష్మ తల్లిదండ్రులు అనుకున్నారు. నవాజ్ కన్నవాళ్ళు కూడా ఒకే ఇంటి నుంచి ఇద్దరు కోడళ్ళను తీసుకురావద్దని భావించారు.Telugu news, Lovers who Victory death and elders.. Nikha in hospitalదీంతో వారి ప్రేమకు అడ్డుచెప్పారు. పెళ్లి చేయమని ఖరాఖండిగా చెప్పారు. దీంతో రేష్మ బాగా మనస్తాపం చెందింది. ఈనెల 8న అత్వెల్లిలోని తన ఇంట్లో పురుగుల మందు తాగింది. వెంటనే ఆమెను వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయం తెలుసుకున్న నవాజ్‌ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించాడు. తనకోసం తన ప్రియురాలు పురుగుల మందు తాగడాన్ని చూసి అతని మనసు కకావికలమైంది. రేష్మ తాగిన పురుగుల మందు డబ్బాను పరిశీలిస్తున్నట్టు తీసుకుని అందులో మిగిలివున్న మందును అందరూ చూస్తుండగానే తాగేశాడు. వెంటనే వైద్యలు అతనికి చికిత్స అందించారు.

మూడు రోజుల తర్వాత ఇరువురికీ ప్రాణాపాయం లేదని వైద్యులు కుటుంబ పెద్దలకు చెప్పారు. మరణం అంచుల దాకా వెళ్లొచ్చిన తమ పిల్లల ప్రేమను అప్పుడు అర్థం చేసుకున్నారు ఇరువర్గాలు పెద్దలు. ఇంకా ఉపేక్షిస్తే కళ్లముందు పిల్లలు బలైపోతారని భావించారు. వారి పెళ్లికి ఒప్పుకున్నారు. వెంటనే ఖాజీని(పెళ్లి చేసే వ్యక్తి) పిలిపించి ఆస్పత్రిలోనే నిఖా చదివించారు.