నా 150 కోట్లు ఈ గోనె సంచుల్లో వేయండి.. - MicTv.in - Telugu News
mictv telugu

నా 150 కోట్లు ఈ గోనె సంచుల్లో వేయండి..

April 4, 2018

కాలం చాలా మారింది. ఎంత మారింది అంటే డబ్బులను డబ్బు రూపంలో గాకుండా ఫోనుల్లో అంకెల రూపంలో చూసుకుంటున్నాం. పేమెంట్లనీ ఆన్‌లైన్ వేదికగానే సాగుతున్నాయి. కానీ  ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఓ వ్యక్తి మాత్రం బ్యాంకుకు డబ్బుల కోసం బ్యాగో, సూటుకేసో తీసుకుపోలేదు. ఏకంగా గోనెసంచులు పట్టుకెళ్ళాడు. అదీ ఈ మధ్య బాగా జనాల నోళ్ళల్లో నానుతున్నపంజాబ్ నేషనల్ బ్యాంకుకే వెళ్లాడు. హపూర్‌కు చెందిన ఈ మహానుభావుడి పేరు మంగళ్‌ సింగ్‌.  తన అకౌంటులో వున్న డబ్బులు మొత్తం డ్రా చేసి ఇవ్వండి సంచిలో వేసుకొని వెళ్తానని చెప్పాడు.అతని వాలకం చూసి బ్యాంకు సిబ్బంది అనుమానపడ్డారు. సరే ముందు విత్‌డ్రా ఫాం నింపి ఇవ్వండి అని మర్యాదగా చెప్పారు. అంతే అతను పరపరమని రెండు మూడింటి మీద రాసిచ్చాడు. అతను రాసిచ్చిన ఫామ్ చూసి బ్యాంక్ సిబ్బంది అవాక్కయ్యారు. అతను డ్రా చెయ్యమని రాసింది రూ. 150 కోట్ల రూపాయలు. తొలుత నిజంగానే అతని అకౌంటులో అన్ని డబ్బులు వున్నాయని అనుకున్నారు బ్యాంకు సిబ్బంది.

మేనేజర్‌ ఆదేశాల అనుసారం అతని ఖాతా తనిఖీ చేయగా అందులో కనీస నిల్వ కూడా లేదు. 2016నుంచి ఆ ఖాతా పనిచేయడం లేదు.  దీంతో బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. బ్యాంకు వద్దకు వచ్చిన పోలీసులు మంగళ్‌ను చూసి నిర్ఘాంతపోయారు. అంతకు ముందు ఒకరోజు ముందే పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడట. ‘రేపు నేను  బ్యాంకుకు వెళుతున్నాను.. నాకు మీ రక్షణ కావాలి’ అని కోరాడట. వీడెక్కడి పిచ్చోడనుకొని పోలీసులు అతని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారట. తర్వాత అందరికీ వారి కుటుంబ సభ్యుల నుంచి తెలిసిన నిజం ఏంటంటే.. మంగళ్ మానసిక స్థితి కొన్ని రోజులుగా బాగా లేదట. సినిమాలు బాగా చూసేవాడట. అలా చూసీ చూసీ సినిమాల్లోని సన్నివేశాలను అనుకరించడం మొదలు పెట్టాడట. ఈ విషయం తెలిసి అతణ్ణి వదిలిపెట్టారు పోలీసులు.

‘ బ్యాంకులు ఎప్పుడూ తమని వెర్రిపప్పలను చేసి విదేశాలకు పారిపోయే దొంగలకే సద్దులు కడతాయి. ఇలాంటి పిచ్చోడిని ఎందుకు నమ్ముతాయి ’ అని సోషల్ మీడియాలో సెటైర్లు విసురుతున్నారు.