జర్నలిస్టును లారీతో ఢీకొట్టి చంపారు.. ఇసుక మాఫియా ఘాతుకం - MicTv.in - Telugu News
mictv telugu

జర్నలిస్టును లారీతో ఢీకొట్టి చంపారు.. ఇసుక మాఫియా ఘాతుకం

March 26, 2018

అక్రమాలను వెలికితీసే జర్నలిస్టులను దారుణంగా హత్య చేస్తున్నారు. నిజాలను నిర్బయంగా రాసి, ప్రచారం చేసే కలాలను వ్యాపారులు, రాజకీయ నాయకులు కలసి విరిచేస్తున్నారు. పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య వివాదం కొలిక్కి రాకముందే మరో జర్నలిస్టు హత్యకు గురయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని బింద్ పట్టణంలో ఈ ఘోరం జరిగింది. ఇసుక మాఫియాపై వార్తలు అందిస్తున్న న్యూస్ వరల్డ్ చానల్  జర్నలిస్టు సందీప్‌ను మాఫియా రోడ్డు మీద లారీతో ఢీకొట్టి చంపేసింది. సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇసుకను అక్రమంగా తవ్వి, అమ్ముకుంటున్న వ్యాపారులకు, పోలీసులకు మధ్య ఉన్న సంబంధాలను సాక్ష్యాలతో సహా వివరిస్తూ సందీప్ కథనాలు అందించాడు. స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి అవినీతిపరులను రోడ్డుకు ఈడ్చాడు. దీంతో మాఫియా అతనిపై పగబట్టింది. చంపుతామని బెదిరించింది. సోమవారం ఉదయం సందీప్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా లారీ వెంబడించింది. సందీప్‌ను ఢీకొట్టి అతనిపై నుంచి వెళ్లిపోయింది. సందీప్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ దృశ్యాలు దగ్గర్లోని సీసీ కెమరాలో రికార్డయ్యాయి. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ ఘటన చోటుచేసుకోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.