ఆ గ్రామంలో ఒక్కరు కూడా ఓటు వేయలే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆ గ్రామంలో ఒక్కరు కూడా ఓటు వేయలే..

December 8, 2018

తెలంగాణలో నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పట్టణాల్లోని ప్రజలంతా పల్లెలకు పయనమయ్యారు. అన్ని చోట్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 69.1 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ శాతం అత్యధికంగా ఖమ్మం జిల్లా మధిరలో నమోదు కాగా, అత్యల్పంగా హైదరాబాద్‌లోని  మలక్‌పేటలో నమోదైంది. ఇలా అన్ని చోట్ల అటు ఇటుగా పోలింగ్ జరిగినా.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మొట్ల తిమ్మాపూర్‌ గ్రామంలో మాత్రం ఒక్క ఓటు కూడా పడలేదు. గ్రామాభివృద్ధి పట్టించుకోని వారికి తాము ఓట్లు ఎందుకు వేయాలంటూ గ్రామస్థుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోలేదు.Telugu News Mahabubabad District bayyaram mandal motla thimmapur Villagers Not Voting For Assembly Electionsఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వచ్చిన నాయకులు, గెలిచాక మాత్రం అభివృద్ధి పనులు చేయడానికి ఊరి పొలిమేర కూడా తొక్కరని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న తమ గ్రామాన్ని పట్టించుకునే నాథుడే లేడని, గ్రామంలో కనీస సౌకర్యాలు లేక తాము నానా కష్టాలు పడుతున్నామని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఇన్నాళ్లు గ్రామానికి రాని వాళ్లు ఇప్పుడొచ్చి, మీకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటే నమ్మి ఓట్లు వేయలేమని తేల్చి చెప్పేశారు. ఈ విషయం తెలుసుకున్న అదికారులు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎంత మొత్తుకున్నా.. ఒక్కరు కూడా ముందుకొచ్చి ఓటు వేయలేదు. దీంతో చేసేదేమి లేక అధికారులంతా వెనక్కి వెళ్లిపోయారు.