mictv telugu

ఎమ్మెల్యేను రోడ్డుపై చితగ్గొట్టిన భార్య, తల్లి

February 13, 2019

ఇంటిపోరు రచ్చకెక్కితే పరువు పోతుంది. సామాన్యుడికైనా, మహానాయకుడికైనా ఇది వర్తిస్తుంది. తనను పట్టించుకోకుండా తిరుగుతున్నావంటూ ఓ ఎమ్మెల్యేను అతని భార్య నడిబజారు చావగొట్టింది. ఆమెతోపాటు అతని  తల్లి, స్థానికులు కూడా వంతపాడుతూ తలా ఓ చెయ్యివేశారు. మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో మంగళవారం జరిగిన ఈ తన్నుడు కార్యక్రమం చోటుచేసుకుంది.

ఆర్నీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజు నారాయణ్ తోడ్సమ్ ఇటీవల రెండో పెళ్లి వెలగబెట్టుకున్నాడు. అతడు మంగళవారం రెండో భార్య ప్రియా షిండేతో కలసి క్రీడా టోర్నమెంట్‌ను ప్రారంభించి, ఇంటికి వెళ్తున్నాడు. ఇదే అదునుగా భావించిన మొదటి భార్య అర్చన, తన అత్త, ఇతర బంధుమిత్రులతోపాటు స్థానికులతో అక్కడికి చేరుకుంది.

మాటా మాటా పెరిగింది. ప్రియా షిండేపై అర్చన పిడిగుద్దులు కురిపించింది. వదిలేయాలని బతిమాలుకున్నా పట్టించుకోలేదు. ప్రియను కాపాడటానికి నారాయణ్ యత్నించగా, అతనిపైనా అర్చన దాడి చేసింది. అతని తల్లి, జనం కూడా తన్నారు. ఇంత జరుగుతున్నా.. అదేదో మన సార్ ఇంటి గొడవ, మనకెందుకులే ఎమ్మెల్యే భద్రంతా సిబ్బంది మిన్నకుండి పోయారు.

నారాయణ్.. అర్చన బాగోగులు పట్టించుకోకుండా రెండో పెళ్లాంతో తిరుగుతున్నాడని స్థానికులు ఆరోపించారు. ఆమె గిరిజన పాఠశాలలో పనిచేస్తోందని, ఆమెకు, ఆమె ఇద్దరు పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై దాడి విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను, ప్రియను తమ వాహనంలో ఎక్కించుకుని ఆస్పత్రిలో చేర్చారు.  telugu news Maharashtra BJP Lawmaker Raju Narayan Todsam  Thrashed By Wife, Mother Over Second Marriage