భారత జాతిపిత మహాత్మాగాంధీని ప్రపంచంలోని చాలా దేశాలు గౌరవిస్తుంటాయి. స్టాంపుల ముద్రణ, విగ్రహాల ఏర్పాటు, అవార్డుల ప్రదానం వంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆయన ఆదర్శాలను గుర్తుచేస్తుంటాయి. అగ్రరాజ్యం అమెరికా కూాడా మన అహింసామూర్తిని గౌరవించనుంది.
అత్యున్నత పౌరపురస్కారమైన కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్‌ను గాంధీకి ప్రకటించే అవకాశముంది.. అమెరికా చట్టసభ ప్రతినిధులు గాంధీకి ఈ పురస్కారాన్ని ప్రకటించాలని తీర్మానించారు. ‘హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్’కు చెందిన కరోలిన్ మలోన్ సభలో సెప్టెబర్ 23న ఈమేరకు తీర్మానాన్ని ప్రతిపాదించారు. భారతీయ అమెరికన్ ప్రజాప్రతినిధులు అమీ బేరా, రాజా క్రిష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్ దీనికి మద్దతు ప్రకటించారు.మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా తీర్మానం చేశారు.
ఇప్పటి వరకు చాలా తక్కువ మంది విదేశీయులకే ఈ అవార్డును ప్రకటించారు. వారిలో మదర్ థెరిసా(1997), నెల్సన్ మండేలా(1998), పోప్ జాన్ పాల్-2(2000), దలైలామా(2006), ఆంగ్ సాన్ సూకీ(2008), మొహమ్మద్ యూనిస్(2010), షిమోన్ పీరస్(2014)లు ఈ పౌర పురస్కారాన్ని అందుకున్నారు.