నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ - MicTv.in - Telugu News
mictv telugu

నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ

April 21, 2018

పట్టాదార్ పాసుపుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీపై చర్చించడానికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు ఇవాళ కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ప్రగతిభవన్‌లో ప్రారంభమయ్యే ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరు కావాలని ఆదేశించారు. పాసుపుస్తకాలు, చెక్కుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్దేశించిన సమయంలో రైతులందరికీ అందేలా సీఎం కేసీఆర్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.ప్రజాప్రతినిధులు, అధికారులు అందరినీ సమన్వయం చేసుకుని ఏవిధంగా పంపిణీ జరగాలని దానిపై కూలంకషంగా చర్చించనున్నారు. రెవెన్యూ, వ్యవసాయశాఖల ఉన్నతాధికారులతోపాటు, జిల్లా జాయింట్ కలెక్టర్లు పాల్గొంటారు. పాసుపుస్తకాలు, చెక్కుల ముద్రణను వీలైనంత త్వరగా పూర్తిచేసి, మే 9 నాటికి గ్రామాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు.

ఈ మేరకు 25 లక్షల పాసుపుస్తకాలు ఆయా జిల్లాలకు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా 58 లక్షల మంది రైతులకు పట్టాదార్ పాసుపుస్తకాలుతో పాటు రైతుబంధు చెక్కులను మే 10 నుంచి పంపిణీ చేయనున్నారు.