గాజు గుండీని  1.2 కోట్లకు కొన్నాడు.. తర్వాత ఏమైంది? - MicTv.in - Telugu News
mictv telugu

గాజు గుండీని  1.2 కోట్లకు కొన్నాడు.. తర్వాత ఏమైంది?

February 1, 2018

మోసపోయేవాళ్ళుంటే మోసం చెయ్యటానికి మేం రెడీ అంటున్నాడు కేటుగాళ్ళు. ఒకరి అమాయకత్వాన్ని ఇంకొకరు ఎలా క్యాష్ చేసుకున్నది హైదరాబాదు నగరంలో జరిగిన ఈ ఘటన చెప్తున్నది. గాజుముక్కను వజ్రం అని నమ్మించి రూ. 1.2 కోట్లకు అమ్మిన ఘటన పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.

ఆసిఫ్ నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అథర్ సిద్దిఖీ, ఆర్సీపురం వాసి మహ్మద్ సల్మాన్ ఖాన్‌లు కలిసి ఈ స్కెచ్ వేశారు. సల్మాన్  గతంలో నాంపల్లిలోని మహ్మద్ ఖాన్ జ్యుయెలర్స్‌లో సేల్స్‌మేన్‌గా పని చేశాడు. తర్వాత వీరిద్దరు కలిసి ముత్యాలు, రత్నాల వ్యాపారం చేశారు. వ్యాపారంలో నష్టాలు రావటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో వారు ఎలాగైనా భారీ ప్లాన్‌తో లైఫ్ సెట్ చేసుకోవాలని అనుకున్నారు.చార్మినార్ సండే మార్కెట్‌కు వెళ్ళి కోటు గుండీల్లో పొదిగే వజ్రం మాదిరి గాజును రూ. 3,500 కు కొన్నారు. దాన్ని ఒక బాక్సులో పెట్టి 25 క్యారెట్ల వజ్రం తమ వద్ద వుందని ప్రచారం మొదలు పెట్టారు. రూ. 4.5 కోట్ల విలువైన వజ్రంగా చెప్పుకొచ్చారు. సల్మాన్‌కు గతంలో సేల్స్‌మేన్‌గా పని చేస్తున్నప్పుడు సనత్ నగర్ వాసి షేక్ హాజీ అలియాస్ ఇలియాస్‌తో పరిచయం వుంది. అతడు ప్రస్తుతం సొంతంగా వ్యాపారం చేస్తున్నాడు.

హాజీని సంప్రదించిన సల్మాన్‌ తనకు తెలిసిన వ్యక్తి వద్ద రూ.4.5 కోట్ల విలువ చేసే మేలైన వజ్రం ఉందని, మార్కె ట్‌లో ఖరీదు చేసే వాళ్లు అనేక మంది ఉన్నారని చెప్పి నమ్మించాడు. సదరు వ్యక్తికి అత్యవస రంగా డబ్బు అవసరమై రూ.1.2 కోట్లకే అమ్ముతున్నాడంటూ చెప్పాడు. ఇప్పుడు దాన్ని ఖరీదు చేస్తే.. వారంలోనే రూ.4.5 కోట్లకు అమ్ముకుని లాభం పొందవచ్చంటూ నమ్మ బలికాడు. దీంతో అప్పులు చేసిన హాజీ తన దగ్గర ఉన్న డబ్బు కలిపి రూ.1.2 కోట్లు సిద్ధం చేశాడు.

చాలా పకడ్బందీ వ్యూహంతో హాజీని ఈ నెల 18న నాంపల్లిలోని ఓ లాడ్జికి రప్పించారు. అక్కడకికొచ్చిన అథర్. ఆ గాజుముక్కను రకరకాలుగా పరీక్షించి ఇది ఒరిజినల్ వజ్రం అని చెప్పాడు. హాజీ అది నమ్మి డబ్బులిచ్చేసి వజ్రం కొన్నాడు. వారం రోజుల తర్వాత వజ్రం అమ్మటానికి పార్టీలను తీసుకొస్తామని చెప్పిన ఇద్దరు తోడు దొంగలు పత్తా లేకపోయేసరికి తానే విక్రయిస్తానని మార్కెట్లోకి బయలుదేరాడు హాజీ. వజ్రం వ్యాపారులు దాన్ని పరీక్షించి ఇది కోటు గుండీకి పెట్టే గాజు అని చెప్పగానే చల్లని చెమట్లతో అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం బుధవారం ఖాన్, అథర్‌లను పట్టుకుని రూ.1.15 కోట్లు స్వాధీనం చేసుకొని హాజీకి అప్పజెప్పారు.