మెట్రో తొలి రైలు నడిపింది నిజామాబాద్ యువతే... - MicTv.in - Telugu News
mictv telugu

మెట్రో తొలి రైలు నడిపింది నిజామాబాద్ యువతే…

November 29, 2017

హైదరాబాద్ కిరీటంలో కలికితురాయి  మెట్రో రైలు. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమైంది ఈ సర్వీస్.. మోదీతోపాటు, కేసీఆర్, గవర్నర్ తదితరులను తీసుకెళ్లి తొలి అధికారిక  మెట్రో రైలును నడిపింది నిజామాబాద్ జిల్లా కంఠేశ్వర్ కు చెంది సుప్రియా సనమ్.

అబ్బాయిలకు ధీటుగా అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపించింది సుప్రియ. సామాన్య కుటుంబం నుంచి  వచ్చిన ఈ యువతి  మెట్రోరైలు తొలి తెలంగాణ లోకో పైలట్‌గా నిలిచింది. ఆమెకు  చిన్నప్పట్నించీ తనకు బైకు నడపాలని వుండేది.  

బైకు నడపడాలన్న కోరిక కాస్తా.. రైలు నడపాలనే కోరికగా మారింది.  అందుకోసం ఎంతగా శ్రమించాలో అంత శ్రమించి తన కల నిజం చేసుకున్నది. తండ్రి ప్రమోద్ కుమార్ ప్రైవేట్ విద్యాసంస్థలో  పని చేస్తున్నారు.  తల్లి ప్రభావతి ఏపీ డెయిరీలో పర్యవేక్షకురాలిగా పదవీ విరమణ చేశారు. కూతురి అభిరుచిని గమనించి ఆడపిల్ల అనే వ్యత్యాసం చూపకుండా ప్రోత్సహించారు. అందుకే సుప్రియ ఇవాళ తెలంగాణ తొలి మహిళా లోకో పైలట్‌గా రికార్డు సృష్టించింది.

సుప్రియా సనమ్ ఏమందంటే..

‘ నేను బాల్యం నుంచే చదువూ, ఆటపాటల్లో చాలా చురుగ్గా వుండేదాణ్ని. టేబిల్ టెన్నిస్, బ్యాట్మింటన్, హాకీ, సంగీతం ఇలా అన్నింట్లోనూ  నాకు ప్రావీణ్యం వుంది.  ఇంటర్‌ వరకూ మా ఊరిలోనే చదివాను.  హైదరాబాద్‌లోని వీబీఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశాను. సీబీఐటీలో ఎంటెక్‌ పూర్తిచేశాను. రైలు నడపాలనే ఆసక్తితోనే ఎంటెక్‌లో కోర్‌ సబ్జెక్టుగా మెట్రోరైలు లోకో పైలట్‌ అంశాన్ని ఎంచుకున్నాను. ఇందుకోసం ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లోని మెట్రోరైలు ప్రాజెక్టుపై ప్రత్యేకంగా నివేదిక కూడా రూపొందించాను. అప్పుడే హైదరాబాద్‌లోని మెట్రోరైలును నడపగలిగితే ఎలా ఉంటుందని అనిపించింది కానీ నాకా అవకాశం రావాలిగా.

లక్కీగా హైదరాబాద్‌లో మెట్రో రైలు మొదలైంది. 2015లో లోకో పైలట్‌లు కావాలంటూ  ప్రకటన వచ్చింది. ఇదే మంచి అవకాశం అనుకుని వెంటనే దరఖాస్తు చేసుకున్నా. ముందస్తు ఎంపికా, పరీక్షల్లో విజయవంతం కావడంతో ఏడాదిన్నర పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నా.  ఎల్‌ అండ్‌ టీ సంస్థ శిక్షణ అందించింది. ఈ నవంబరు 23 నాటికి పూర్తయ్యింది. రేపటి నుంచి ప్రయాణికుల్ని ఎక్కించుకుని నడపబోతున్నా. ఇకపై మాకు రోజూ పనివేళలు ఎనిమిది గంటలు. దాన్ని బట్టి ఎన్ని విడతల్లో నడపాల్సి వస్తుందనేది తెలీదు. నేననుకున్న రంగంలో విజయం సాధించినందుకు చాలా ఆనందంగా వుంది.