మన మెట్రో స్మార్ట్‌కార్డ్..  వెరీ స్మార్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

మన మెట్రో స్మార్ట్‌కార్డ్..  వెరీ స్మార్ట్

November 25, 2017

నగరంలో మరి కొద్ది రోజుల్లోనే మెట్రో రైలు పరుగులు పెట్టనున్నది. అంతకు ముందే ఈ రోజు నుండి మెట్రో స్టేషన్‌లో స్మార్ట్‌కార్డుల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ‘ టీ సవారీ ’ పేరుతో మెట్రో స్మార్ట్‌కార్డును  ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్. ఇన్ని రోజులూ ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణించిన నగరవాసులు ఇక కొత్తగా మెట్రో ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. ఈ క్రమంలో స్మార్ట్‌కార్డ్ ప్రాముఖ్యతను సంతరించుకున్నది. తొలుత ఈ కార్డు ధర రూ. 100. ఆ తర్వాత కనిష్టంగా రూ. 200 నుంచి ఆపైన బ్యాంకు అకౌంట్ల ద్వారా, ఆన్‌లైన్‌లోనే గాకుండా మెట్రో స్టేషన్‌లలో కూడా రీచార్జ్ చేసుకోవచ్చు.  ఈ కార్డు కొనుగోలు చేశాక ప్రయాణ సమయంలో ఆటోమెటిక్ ఫేర్ కలెక్షన్ యంత్రాల దగ్గర ఉండే రీడర్‌పై కార్డు చూపించగానే లోపలికి వెళ్ళేందుకు గేట్లు తెరుచుకుంటాయి. తర్వాత రైలు దిగిపోయేటప్పుడు కూడా ముందులాగానే కార్డును రీడర్‌కు చూపిస్తే బయటకు వెళ్ళిపోవచ్చు. భవిష్యత్తులో ఈ స్మార్ట్‌కార్డును ఎంఎంటీఎస్, ఆర్టీసీలకు కూడా అనుసంధానం చేయనున్నారు. టికెట్లు ( టోకెన్ ) కూడా మెట్రో స్టేషన్లలోని టికెట్ కౌంటర్లకు చేరుకున్నాయి. మెట్రో ప్రారంభానికి గడువు తక్కువగా వుండటంతో అధికారులు టోకెన్లను అక్కడి యంత్రాల్లో ఉంచి తనిఖీ చేస్తున్నారు.