‘ మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ ’ టెన్షన్.. టెన్షన్.. - MicTv.in - Telugu News
mictv telugu

‘ మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ ’ టెన్షన్.. టెన్షన్..

March 10, 2018

10 మర్చి 2011.. ఈరోజు ప్రతీ ఒక్కరికీ గుర్తుండేరోజే. మలి తెలంగాణ ఉద్యమానికి మరింత శక్తినిచ్చిన రోజు. అదే మిలియన్ మార్చ్. లక్షలాది తెలంగాణ గుండెలు, గొంతుకలు ఉవ్వెత్తున ఎగిసిపడిన రోజు. ఆరోజు హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ ప్రాంతమంతా కిక్కిరిసిపోయిన రోజు. ఎందరినో కదిలించి, స్ఫూర్తిని నింపిన చారిత్రక సందర్భం ‘మిలియన్ మార్చ్’ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. ఉద్యమకారులకు, ప్రజలకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చిన ఆరోజును మరోసారి గుర్తు చేసుకుని స్ఫూర్తి పొందేందుకు ప్రొ. కోదండరాం ‘ మిలియన్ మార్చ్ స్ఫూర్తి ‘ సభను తలపెట్టారు. విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్షాలు ఇందుకు మద్దతు పలికాయి. అయితే ప్రభుత్వం దీనికి అనుమతినివ్వకపోవడం గమనార్హం. అనుమతి లేకపోయిన టీజేఏసీ సభకు సిద్దమవడంతో ట్యాంక్‌బండ్‌ను అష్టదిగ్బంధనం చేసింది.ట్యాంక్‌బండ్‌పై ఉన్న మొఖ్దం మొహీయుద్దీన్ విగ్రహం దగ్గర ఆటపాటలతో సభ ఊరేగింపును ప్లాన్ చేసుకున్నట్టు కోదండరాం తెలిపారు.  రాష్ట్రం సిద్ధించినప్పటికీ నిరుద్యోగ సమస్య పెరగిందే తప్ప తగ్గలేదు, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఆనాటి స్ఫూర్తిని మరోసారి రగిలించి తెలంగాణ ప్రజల్లో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని కోదండరాం అంటున్నారు. ‘ మిలియన్ మార్చ్ స్ఫూర్తి ‘ సభపై శనివారం ఉదయం ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతో భేటీ అవుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఆదేశానుసారం ఎలాంటి అల్లర్లు జరగకుండా ట్యాంక్‌బండ్ చుట్టూ పోలీసులు మోహరించివున్నారు. ట్యాంక్‌బండ్‌పై ఎలాంటి సభలకు అనుమతి లేదని, ఒకవేళ ఎవరైనా అందుకు ప్రయత్నిస్తే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఉదయం 11గం. నుంచి సాయంత్రం 5గం. వరకు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించింది. ట్యాంక్‌బండ్ చుట్టూ వున్న సంజీవయ్యపార్క్, లుంబినీ పార్క్, లేక్ వ్యూలను మూసివేయించారు.