మిలియన్ మార్చ్... ఆ రోజు ఏం జరిగింది? - MicTv.in - Telugu News
mictv telugu

మిలియన్ మార్చ్… ఆ రోజు ఏం జరిగింది?

March 10, 2018

2011 మార్చి 10న  తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపు ‘మిలియన్ మార్చ్’. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిలియన్ మార్చ్‌ను విఫలం చేయటానికి అన్నీ రకాల ప్రయత్నాలు చేశాయి. ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా తెలంగాణ జనం మాత్రం మొక్కవోని ధైర్యంతో మార్చ్‌ను విజయవంతం చేశారు. కోదండరాంను ముందే అరెస్ట్ చేశారు. కేసీఆర్‌ను గృహనిర్బంధం చేశారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించే నాయకత్వాన్ని కట్టడి చేశారు. అసలు జన సమీకరణకు వీలు లేకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రైవేట్ వాహనదారులకు బెదిరింపులు.. తెలంగాణ పది జిల్లాల నుంచి హైదరాబాద్ చేరుకుని తొవ్వలన్నింటిని మిలియన్ మార్చ్‌కు మూడు రోజుల ముందే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో పొద్దుమాపు పికెటింగ్‌లేసి ప్రతి జీవిని పరిశీలించాకే హైదరాబాద్ పంపిచారు. అయినా మిలియన్ మార్చ్ విజయవంతమైంది. ఎలా విజయవంతమైందో.. మీరే చదవండి…

జెండాలు మోసెటోళ్ళు… జైజైలు కొట్టెటోళ్ళు అక్కడికి రాలే

అంతా తెలంగాణ తెగువను ఒడిసి పట్టినోళ్ళే…

ఎవ్వణ్ణైనా ప్రశ్నిస్తాం… ఓడ్ని నమ్మం…

అక్కడికి చేరుకున్న గుండెలు లబ్‌డబ్ లబ్‌డబ్ అని కొట్టుకోలే…

జై తెలంగాణ అని గొంతెత్తి అరిసినయి…

గుమిగూడిన లక్షల చేతులు మమ్ముల్ని ఎక్కిరించినోడి కుత్కెలు కోస్తామని బెదిరించినయి…

సర్కారు ఇనుప బూట్లకు సమాధానం చెప్పిన ఆ కాళ్ళు….

అధిపత్య అహాన్ని ముక్కలుచెక్కలు చేసినయి…

ప్రతి తొవ్వలో పోలీసులు…గల్లీగల్లీలో పికెటింగులు…

హైదారాబాద్ అంతట అనుమానపు సూపులే…

హైదారాబాద్‌కో పోలీస్‌నే హమ్‌లా కియా…

తో క్యా…

హమ్‌నే మార్చ్ కర్‌కే రహేంగే…

అని జెండాలను పక్కన బెట్టిన తెలంగాణ…

మా ఏజెండా తెలంగాణ రాష్ట్రమని కదిలింది…

పోలీసుల పహారాను, రాష్ట్ర, కేంద్రాల డేగ కన్నుల్లో కారం జల్లీ…

మిలియన్ మార్చి చౌరస్తాకు చేరుకుంది…

నాయకత్వం లేని సమూహం ఎట్లా ఉంటుందో చూపెట్టింది…

అరువై ఏండ్ల తండ్లాటకు…

ట్యాంక్‌బండ్‌పైనే సమాధానం దొరుకుతుందని వెతుకులాడింది…

మా పాట, మాటలను ఆగం చేయాలన్న కుట్రలను కూలగొట్టింది…

డప్పు, చిర్రా…చిటిక, గొంగడి, గజ్జె…సిరుత.. జెండాబట్ట, జెండా కట్టే…

బ్యానరు.. ఫ్లెక్సీ, తాడు, గడ్డపార, మట్టిపెల్లా, గడ్డిపోసా…

పోలీసులా బారికేడ్, నీళ్ళు తోడె పైపులు…

ఎండిన ఆకులు.. రాలిన పూలు, ఆఖరికి…

కాలికిందా దుమ్ము అన్నీ తెలంగాణకై కొట్లాటకు దిగినయి…

అన్నీ మిలియన్ మార్చ్‌లో భాగమే…

మార్చ్‌కు చేరుకున్నోళ్ళ అనుభవాలు వింటుంటే…

గిట్లా గూడా పట్నం రావచ్చ అనిపించింది…

రైలు పాయిఖానాలో పండుకొని వచ్చినోళ్ళు కొందరైతే…

పిల్లలకు పరీక్షలున్నాయని వచ్చినోళ్ళు ఇంకొందరు…

అంబులెన్సులను మాట్లాడుకొని చేరుకున్నోళ్ళు…

పెళ్ళి డ్రామా ఆడి పోలీసోళ్ళకు జెట్క ఇచ్చినోళ్ళు …

మూడురోజుల ముందే సుట్టాల ఇండ్లకు చేరుకున్నోళ్ళు…

ఇలా చెప్పుకుంటు పోతే ఒక్కొక్కరిది ఒక్కోతోవ…

ఆ రోజు ట్యాంక్‌బండ్‌కు చేరుకునోళ్ళంత ఖలేజా ఉన్నోళ్ళే…

చరిత్ర నిర్మాతలే…

మట్టివాసనను మరిచిపోనోళ్ళే…

తల్లిపాల రుణం తీర్చుకుంటామని ఒట్టు తిన్నోళ్ళే…

దంచుడే తెలంగాణకు మార్గమని చాటింపేస్తున్నోళ్ళే..