వేటగాడైన మంత్రి.. దొరకని పులి... - MicTv.in - Telugu News
mictv telugu

వేటగాడైన మంత్రి.. దొరకని పులి…

November 28, 2017

సాక్షాత్తూ..  ఓ మంత్రే  పులిని వేటాడిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా ఛలీస్‌గావ్‌ గ్రామంలో గత కొన్ని రోజులుగా ఓ చిరుతపులి తిరుగుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. గ్రామంలోని చాలామందిపై దాడి చేసింది. గ్రామంలో ఉన్న ఆవులను, బర్రెలను కూడా చంపేసింది. దాన్ని ఎన్నిసార్లు  ఆటవీశాఖ అధికారులు పట్టుకోవాలని చూసినా చిక్కకుండా అడవిలోకి పారిపోయింది.

దీంతో అటవీశాఖ ఆ పులిని చంపమని  వేటగాళ్లకు కూడా అనుమతి ఇచ్చారు. అయితే ఈ వార్త మహారాష్ట్ర మంత్రి గిరీశ్‌ దత్తాత్రేయ మహాజన్ దృష్టికి రావడంతో.. అతనే స్వయంగా తన లైసెన్స్‌డ్ రివాల్వర్ తీసుకుని పులిని వేటాడడానికి ప్రయత్నించారు. అయితే  మంత్రి పిస్టల్‌కు  కూడా చిక్కకుండా ఆ చిరుత తప్పించుకుని పారిపోయింది.

మంత్రి పిస్టల్  చేతపట్టి పులిని వేటాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పులిని చంపాలంటే అధికారులు చూసుకుంటారు. ఈ విషయం మంత్రికి అవసరమా అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గతంలో కూడా మద్యం అమ్మకాలు పెరగాలంటే వాటిపై మహిళల పేర్లు పెట్టాలన్న ఈ మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.