4,700 మంది తెలంగాణ పిల్లలు ఏమైపోయారు?   - MicTv.in - Telugu News
mictv telugu

4,700 మంది తెలంగాణ పిల్లలు ఏమైపోయారు?  

December 4, 2017

రోజురోజుకూ పిల్లల అపహరణ కేసులు ఎక్కువే అవుతున్నాయి తప్ప తగ్గుముఖం పట్టడంలేదు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో గతేడాది 4,700 మంది పిల్లలు అదృశ్యం కావడం విస్మయానికి గురి చేస్తున్నది.

జాతీయ క్రైమ్ రికార్డ్ బ్యూరో విడుదల చేసిన గణాంకాల్లో గత ఏడాది 2,921 మంది బాలికలు, 1779 మంది బాలురు ఇళ్ళ నుండి తప్పిపోయారని తెలిపింది. పోలీసు రికార్డుల ప్రకారం 2016 లో 4,700 మంది పిల్లలు తప్పిపోయారు. వారిలో కేవలం 1021 మంది పిల్లలను ( 377 బాలురు, 644 బాలికలు ) మాత్రమే పోలీసులు గుర్తించారు.  ఇంకా 1,402 బాలురు, 2,277 మంది బాలికలు సహా 3,679 మంది పిల్లల ఆచూకీ లభించలేదు.

తమిళనాడులో 3324, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5801 మంది పిల్లలు తప్పిపోయారని కేసులు నమోదు అయ్యాయి. వీరిలో కొంతమంది పిల్లలు ఇంటి నుండి పారిపోయారని, కొందరిని అగంతకులు అపహరించుకుపోయారని పోలీసు అధికారులు చెబుతున్నారు. తప్పిపోయిన తమ పిల్లల ఆచూకి లభించకపోయేసరికి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లల ఆచూకి కోసం పోలీసులు గాలించినప్పటికీ వారి జాడ తెలియకపోవడంతో బాధితుల్లో ఉద్విగ్నత నెలకొన్నది.