వాట్సాప్ మెసేజీలో మిస్టేక్.. రెండుగా చీలి కొట్టుకున్న తండా - MicTv.in - Telugu News
mictv telugu

 వాట్సాప్ మెసేజీలో మిస్టేక్.. రెండుగా చీలి కొట్టుకున్న తండా

February 23, 2018

రెండు వర్గాల మధ్య వాట్సాప్ చిచ్చు పెట్టింది. అదేంటీ పెరిగిన  టెక్నాలజీ మనుషులకు ఉపయోగపడాలి గానీ కయ్యాలు పెడుతుందా అని ఆశ్చర్యపోకండి. ఇద్దరు యువకుల మధ్య చెలరేగిన ఈ వాట్సాప్ ఘటన బుధవారం రాత్రి జరిగింది.

శంషాబాద్ మండలంలోని మదన్‌పల్లి పాత తండాకు చెందిన బంజారా యూత్‌ సభ్యులు స్థానికంగా ఉన్న ఆలయం వద్ద బుధవారం రాత్రి సమావేశమయ్యారు. సమావేశానికి సంఘంలోని సభ్యుడు మున్నా రాలేదు. రావాల్సిందిగా మరో సభ్యుడు వినోద్ మున్నాకు వాట్సాప్‌లో సందేశం పంపాడు. సందేశంలో తప్పులు వున్నాయని అక్కడికొచ్చిన మున్నా, వినోద్‌ను నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. మధ్యలో స్నేహితులు కల్పించుకొని ఎంత నచ్చజెప్పినా వినలేదు వారిద్దరు.

గొడవ పెద్దది కావడంతో తండావాసులు అక్కడకు రాగా.. రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరురొని ఇరు వర్గాల వారికి సర్దిచెప్పారు. అంతటితో ఆగిపోయి గురువారం ఉదయం మళ్ళీ ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగారు. దీంతో కొంత మందికి గాయాలు అయ్యాయి. మళ్ళీ రంగంలోకి దిగిన  ఎస్సై సురేష్, స్థానిక సర్పంచ్‌తో కలిసి లాలీచందర్‌ తండాకు వెళ్లి ఇరు వర్గాలతో మాట్లాడి శాంతింపజేశారు. ఇరు వర్గాల వారి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.