సొంత చెల్లెలికే జరిమానా.. ట్రాఫిక్ పోలీసుకు సలాం - MicTv.in - Telugu News
mictv telugu

సొంత చెల్లెలికే జరిమానా.. ట్రాఫిక్ పోలీసుకు సలాం

October 9, 2018

ఉద్యోగం ఉద్యోగమే… వ్యక్తిగతం వ్యక్తిగతమే. ఉద్యోగం చేసేచోట వ్యక్తిగత విషయాలను తీసుకురాకూడదు. డ్యూటీలో వున్నప్పుడు చాలా నిబద్ధతగా, నిజాయితీగా పని చెయ్యాలి. అయితే ఈ విషయంలో కొంతమంది పట్టు తప్పుతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం వృత్తికి విలువిచ్చాడు. వృత్తిధర్మం ముందు భవబంధాలు కుదరవు అన్నాడు. రూల్స్ విషయంలో మన, పరాయి బేధాలు లేవు.. అందరికీ సమానమే అని నిరూపించాడు. మిజోరాంకు చెందిన ట్రాఫిక్ పోలీసు ఏం చేశాడంటే.. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిందని సొంత చెల్లెలి చేత ఫైన్ కట్టించాడు. రెండు నెలల క్రితం జరిగిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన నిజాయితీపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

‘అదేంటయ్యా సొంత చెల్లెలికి జరిమానా విధిస్తావా ?’ అని కొంతమంది అడిగినప్పటికీ అతని సమాధానం ఒక్కటే.. ‘నా వృత్తిని నేను సక్రమంగా నిర్వహించాను’ అని. వివరాల్లోకి వెళ్తే… రాంథ్లెంగ్లియానా అనే వ్యక్తి మిజోరాం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌లో ట్రాఫిక్ సూపరిండెంట్‌గా పని చేస్తున్నారు. ఐజ్వాల్‌లో ప్రతి వ్యక్తికి గ్యారేజీ ఉంటుంది. రాత్రి సమయాల్లో కార్లు రోడ్డుపై పార్క్ చేయడం నిషేధం. అయితే సదరు పోలీసు అధికారి సోదరి రోడ్డుపై కారు పార్క్ చేసింది. దీంతో చెల్లెలు అనికూడా చూడకుండా తన డ్యూటీ తను చేశాడు. చట్ట ప్రకారం ఆమెకు జరిమానా విధించారు. దీంతో అతని నిజాయితీకి సోషల్ మీడియాలో పలువురు తమ కామెంట్లతో ప్రశంసిస్తున్నారు.