గ్యాంగ్ రేప్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్.. - MicTv.in - Telugu News
mictv telugu

గ్యాంగ్ రేప్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్..

April 13, 2018

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీ రేప్ కేసు ఓ మలుపు తిరిగింది. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఓ యువతిపై సామూహిక అత్యాచారం కేసులో సీబీఐ విచారణకు యోగి ఆదిత్యనాథ్  సర్కార్ అంగీకరించడం తెలిసిందే. కాగా ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని గుర్తించి ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు సీబీఐ అధికారులు ప్రకటించారు. ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో లక్నోలోని కుల్‌దీప్ నివాసానికి వెళ్లిన అధికారులు, ఆయన్ను అరెస్ట్ చేశారు.

గతేడాది జూన్‌లో ఓ యువతి తనను కుల్‌దీప్, అతని అనుచరులు అత్యాచారం చేశారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఇటీవల ధర్నా నిర్వహించింది.  ఆత్మహత్యకు యత్నించింది. తర్వాత విచారణ పేరిట ఆమె తండ్రిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లగా, అతను కస్టడీలో మరణించాడు. పోలీసులే తన తండ్రిని పొట్టన పెట్టుకున్నారని బాధితురాలు ఆరోపించింది. ఈ నేపథ్యంలో యోగి సర్కార్‌పై అనేక విమర్శలు, నిరసనలు వెల్లువెత్తాయి.
దీంతో ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించక తప్పలేదు. ప్రస్తుతం ఉన్నావోకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మఖీ పోలీసు స్టేషన్‌లో కుల్‌దీప్‌పై మూడు కేసులను రిజిస్టర్ చేసిన సీబీఐ, ఆయనపై పోస్కో చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్లను జోడించింది.