అసెంబ్లీకి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఎమ్మెల్యేలు - MicTv.in - Telugu News
mictv telugu

అసెంబ్లీకి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఎమ్మెల్యేలు

March 20, 2018

ఆర్టీసీ బస్సులో తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు ముగ్గురు ఎమ్మెల్యేలు. సాధారణ ప్రయాణీకుల మాదిరి వారు అసెంబ్లీకి సిటీ బస్సులో వచ్చి ప్రయాణీకులను ఆశ్చర్యానికి గురిచేశారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, వివేక్‌లు  తోటి ప్రయాణీకులతో కలిసి ఆర్టీసి బస్సులో ప్రయాణించారు. ఉదయం బాచుపల్లి గ్రామంలో అరికెపూడి గాంధీ బస్‌స్టాప్ వద్ద ప్రయాణీకుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తోటి ప్రయాణికులతో పాటు ఆయన బస్టాండ్‌లో బస్సు కోసం నిరీక్షించారు. ఆ తర్వాత ఆర్టీసి బస్సు ఎక్కారు. ఆయన తర్వాత కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ తన నివాసం నుంచి కాలినడకన సాధారణ ప్రయాణికుడి మాదిరిగా వివేకానందనగర్ బస్‌స్టాప్‌కు చేరుకున్నారు. సుభాష్‌నగర్ నుంచి సిపిఎస్ ఆర్టినరీ బస్సు ఎక్కారు. అసెంబ్లీ వరకు తనతో పాటు పిఎ, ఇద్దరు గన్‌మెన్‌లకు టికెట్లు తీసుకున్నారు. బస్సులో ఓ కాలేజీ విద్యార్థి లేచి వివేక్‌కు సీటు ఇచ్చారు. బస్సులో ప్రయాణీకులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.మరో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైతం బస్సులో ప్రయాణించారు. ఆయన అసెంబ్లీ ముందు ఆకాశవాణి కేంద్రం బస్‌స్టాప్ వద్ద బస్సు దిగి కాలినడకన అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్, కాలేజీ రోజుల్లో బస్సులో వెళ్లిన రోజులను వివేక్ గుర్తు చేసుకున్నారు. బస్సు కండక్టర్‌ను కూడా ఆయన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీకి బస్సులో వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, అది ఇప్పటికి సాధ్యమైందని తెలిపారు.