మాల్యా, మోదీల్లా పారిపోలేక... ఆత్మహత్య! - MicTv.in - Telugu News
mictv telugu

మాల్యా, మోదీల్లా పారిపోలేక… ఆత్మహత్య!

March 1, 2018

బ్యాంకుల్లో తీసుకున్న అప్పు తీర్చలేక అతను విదేశాలకు పారిపోలేదు. ఆత్మహత్యే శరణ్యం అనుకున్నాడు. ఇండియాలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారు ఎందరో ఉన్నారని, వారందరినీ బయటకు తీయాలన్న డిమాండ్ పెరుగుతున్న వేళ అతను భార్య, బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూరత్‌లో తీవ్ర కలకలం రేపింది.

గుజరాత్‌కు చెందిన యువ వ్యాపారవేత్త విజయ్ వాఘాసియా ( 35 ) వస్త్ర వ్యాపారంలో రాణించలేకపోయాడు. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య రేఖ (30), కుమారుడు వీర్ (4)లతో కలసి మెజిస్టిక్ అపార్టుమెంట్ 12వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వ్యాపారంలో విజయం సాధించడంలో విఫలం అయ్యారని, చేసిన అప్పులు తీరే దారి తెలియక ఇంత దారుణానికి పాల్పడ్డారని వెల్లడించారు.

తన కుటుంబం ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఆర్థిక సమస్యలు ఎక్కువ అవటంతో వేరే దారిలేక ఆత్మహత్యకు పాల్పడ్డామని, తన తరువాత తన సోదరుడికి వ్యాపార బాధ్యతలు అప్పగిస్తున్నానని సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నాడు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యాల వలె పారిపోయి దర్జాగా విదేశాల్లో బతకలేక పరువు కోసం ప్రాణాలు తీసుకున్నాడని గుజరాత్ మీడియా వెల్లడించింది.