గత ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేసి చాలా పెద్ద తప్పు చేశానని, ఈ సారి మాత్రం కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తానని తేల్చి చెప్పాడు ప్రధాని మోదీ అభిమాని అభినందన్ పాఠక్. అభినందన్ మోదీకి అభిమాని మాత్రమే కాదు మోదీ ముఖ కవళికలను పోలీ వుంటాడు. ఇన్నేళ్ళు మోదీకి వీనాభిమానిగా వున్నాడు అభినందన్. సడన్‌గా ఆయన బీజేపీకి బైబై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకుని షాకిచ్చాడు. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్పూర్కు చెందిన అభినందన్ ఈ ఏడాది మార్చిలో జరిగిన గోరఖ్‌పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. బీజేపీకి నమ్మినబంటులా వున్నాడు అభినందన్.
‘ఈ ప్రభుత్వ పాలన మీద నేనెన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ నేను అనుకున్నది ఒక్కటి కూడా ప్రభుత్వం చెయ్యలేకపోతోంది. అన్నీ ప్రజా విరుద్ధమైన పనులు చేస్తోంది. నేనెక్కడికి వెళ్లినా మంచి రోజులు ఎప్పుడొస్తాయని జనాలు నిలదీస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేకపోతున్నాను. నా నమ్మకం అబద్ధం అయింది. అందుకే నేను మనస్తాపం చెందాను. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాను’ అని ఆవేదన వ్యక్తం చేశాడు అభినందన్. కాగా కంగ్రెస్ పార్టీ కూడా అభినందన్‌ను పార్టీలో చేర్చుకోవడానికి సుముఖత వ్యక్తం చేసింది.