మోదీ.. భార్యను ప్రేమించడం నేర్చుకో.. బాలకృష్ణ - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ.. భార్యను ప్రేమించడం నేర్చుకో.. బాలకృష్ణ

April 20, 2018

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘మోదీ.. ముందు నీ భార్యను ప్రేమించడం నేర్చుకో.. ద్రోహం చేసిన నిన్ను తరిమికొట్టే రోజు దగ్గరపడింది.. ’ అని తీవ్రంగా హెచ్చరించారు.  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు చేస్తున్న ధర్మ పోరాట దీక్షలో బాలకృష్ణ మాట్లాడారు.. హిందీలో, తెలుగులో దూషణలకు దిగారు.

‘ఏపీకి అన్యాయం చేసిన మోదీ ఒక ద్రోహి. నిన్ను కొట్టి కొట్టి తరిమే రోజు దగ్గర పడింది. బంకర్‌లో దాక్కున్నా వదలం.  ఒకప్పుడు బీజేపీకి రెండు సీట్లు ఉండేవి… వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు. ముందు పెద్దలను గౌరవించడం నేర్చుకో… అద్వానీని గౌరవించలేని వ్యక్తి నువ్వు. కార్యేషు దాసి, కరణేశు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అంటారు… ముందు భార్యను ప్రేమించడం నేర్చుకో… ఎవరెవరినో అడ్డం పెట్టుకుని వ్యవహారాలు నడిపిస్తున్నారు. చిల్లర రాజకీయాలు, కుప్పిగంతులు మానేయాలి ’ అని మండి పడ్డారు.అమరావతి శంకుస్థాపనకు మట్టి, పవిత్ర జలాలను మోదీ తీసుకురావడం గురించి మాట్లాడుతూ… మా దగ్గర మట్టి, నీళ్లు లేవా? అంటూ ఎద్దేవా చేశారు. ప్రతి ఆంధ్రుడు ఒక్కో గౌతమీపుత్ర శాతకర్ణిలా మోదీపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీని ఉద్ధరించే శక్తి కేవలం చంద్రబాబుకు మాత్రమే ఉందని అన్నారు. ఆప్‌కా హుకుం యహాం నహీం చల్తా ( ఇక్కడ మీ రాజకీయాలు చెల్లవు ) అని అన్నారు.