చెట్టంత కన్నకొడుకును కేన్సర్ మహమ్మారి రెండేళ్ల కిందట కాటేసి తీసుకువెళ్ళింది. ముదిమి వయసులో తన కొడుకే తన సర్వస్వం అవుతాడని ఆ టీచరమ్మ కలలు కంది. కానీ ఆమె కలలు కల్లలయ్యాయి. కానీ ఆమె వెనుకంజ వేయేలేదు. తన బిడ్డకు ప్రతిరూపం ఇవ్వాలనుకుంది. తన కొడుకు వీర్యంతో సరోగసీ ద్వారా పుట్టిన ఇద్దరు పిల్లల్లో తన కొడుకును చూసుకుంటోంది ఆ తల్లి. హృదయాన్ని పిండే ఈ ఘటన పుణేలో జరిగింది. పుణేకు చెందిన రాజశ్రీ పాటిల్ ఉపాధ్యాయనిగా విధులు నిర్వహిస్తోంది.కేన్సర్ సోకిన తన కొడుకును బతికించుకోడానికి ఆ తల్లి చేయని ప్రయత్నం లేదు. కానీ చికిత్స ఎలాంటి ఫలితమూ ఇవ్వకపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. దీంతో 2016 ఫిబ్రవరి 28న తుదిశ్వాస విడిచాడు ప్రథమేశ్. అతడి వీర్యాన్ని చికిత్సకు ముందే భద్రపరచాలని వైద్యులను కోరింది. జరగరానిది జరిగితే అతడి ప్రతిరూపాన్ని మళ్లీ చూడాలనే కోరికతో ఇలా చేసింది. ఈ క్రమంలో ఆమె చాలా సవాళ్ళను ఎదుర్కొంది. ఓ సందర్భంలో తానే కొడుకు వీర్యం ద్వారా గర్భం దాల్చాలనుకుంది.
కానీ తన ఆరోగ్యం సహకరించకపోవటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. అద్దె గర్భం ఇచ్చే మహిళల కోసం చాలా గాలించింది. చివరకు ఓ 35 ఏళ్ల మహిళ తన గర్భాన్ని అద్దెకు ఇవ్వడానికి అంగీకరించింది. దీంతో గతేడాది జూన్లో తొలి ప్రయత్నంలోనే ఆమె గర్భం దాల్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 12న పుణేలోని సహ్యాద్రి హాస్పిటల్లో ఆమె కవలలకు జన్మనిచ్చింది. ఈ కవలల్లో ఒకరు అమ్మాయి, అబ్బాయి కావడం విశేషం. వీరిలో అబ్బాయికి ప్రథమేశ్, అమ్మాయికి ప్రీశా అని నామకరణం చేసింది. సరోగసీ ద్వారా పుట్టిన తన మనవళ్లకు కొడుకు, కుమార్తెల పేర్లనే పెట్టుకోవడం అమ్మ ప్రేమకు నిదర్శనం.