రాజీవ్ కనకాలకు మాతృవియోగం - MicTv.in - Telugu News
mictv telugu

రాజీవ్ కనకాలకు మాతృవియోగం

February 3, 2018

ప్రముఖ రంగస్థల, సినీనటి, నటుడు రాజీవ్ కనకాల తల్లి లక్ష్మీ కనకాల శనివారం ఉదయం హైదరాబాద్‌లోని  స్వగృహంలో కన్ను మూశారు. గత కొంత కాలంగా ఆమె తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఆమె మరణవార్తను తెలుసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. లక్ష్మీదేవి భర్త దేవదాస్ కనకాల నటుడు అన్న విషయం తెలిసిందే. వారికి ఒక కుమారుడు ( రాజీవ్ కనకాల ), కూతురు ( శ్రీలక్ష్మి ) వున్నారు. కోడలు సుమ కనకాల ప్రముఖ యాంకర్ అని తెలిసిన విషయమే.లక్ష్మీదేవి తన 11 వ ఏట నుండే కళారంగంలోకి ప్రవేశించారు. నాట్యకారిణిగా, కళాకారిణిగా సేవలు అందించారు. మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నట శిక్షకురాలిగా పని చేశారు. సుహాసిని, శుభలేఖ సుధాకర్ వంటి చాలా మంది నటీనటులు ఆమె వద్ద శిక్షణ తీసుకున్నవారే. నటిగా సినిమాల్లో కూడా తనదైన ముద్ర వేశారామె. ‘ప్రేమబంధం ’ సినిమాలో జయప్రదకు తల్లిగా,‘కొబ్బరి బొండాం’ సినిమాలో రాజేంద్రప్రసాద్‌కు తల్లిగా నటించారు. ‘ పోలీస్ లాకప్’ సినిమాలో విజయశాంతికి అత్త పాత్రలో నటించి మెప్పించారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.