mictv telugu

తుంటరి ఎలుకకు ఉచ్చ పోయించాడు

February 12, 2019

రోజురోజుకు మనుషుల్లో పైశాచికత్వం పెరిగిపోతోంది. నోరులేని మూగ జీవులను చిత్రహింసలు పెట్టడమే ఇందుకు నిదర్శనం. గతంలో హైదరాబాద్‌లో ఓ కారు డ్రైవర్ కారు కింద కుక్కలు పడుకుంటున్నాయని వాటిపై కారు నడిపిన సంఘటన సంచలనం సృష్టించింది. అలాగే ఇటీవల కోల్‌కతాలో పదుల్లో కుక్కపిల్లల్ని చంపారు ఇద్దరు యువతులు.

తాజాగా కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లాలో తన ఎనబై రూపాయల మొబైల్ చార్జర్‌ను ఎలుక కొరికిందని దానిని దొరకబట్టి బాటిల్‌కు కట్టేశాడో ప్రబుద్ధుడు. ఆ తరువాత కర్రతో దాని తల, పొట్టపై కొడుతూ ‘మందలింపు’ పేరుతో చిత్రహింసలు పెట్టాడు. ‘నా మొబైల్ చార్జర్ ఎందుకు కొరికావు? మళ్ళీ ఇలా చేస్తావా? రెండు టమోటా పండ్లు కొరికావు.. నానా అల్లరీ చేశావు.. మళ్లీ అలా చేస్తావా? ’ అంటూ దానిని భయాందోళనకు గురిచేశాడు. అది భయంతో మూత్రవిసర్జన చేసే వరకు కొడుతూనే ఉన్నాడు. అప్పుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో జంతు సంరక్షణకారులు ఆ యువకుడి వీడియోపై మండిపడుతున్నారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.