కవితక్కా.. కిరాణా షాపు పెట్టుకుంటా..   - MicTv.in - Telugu News
mictv telugu

కవితక్కా.. కిరాణా షాపు పెట్టుకుంటా..  

September 28, 2018

కొందరు రాజకీయ నాయకులు సోషల్ మీడియాను ప్రచారం కోసం వాడుతుంటారు. కొందరు ప్రచారంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అలాంటి వారి కోవలోకే వస్తారు. ఆయన ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటూ.. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తుంటారు. సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తుంటారు. అంతేకాదు ఆపదలో ఉన్నామని ఎవరు మొరపెట్టుకున్నా ఆదుకుంటారు. ఇప్పుడు అదేబాటలో ఆయన సోదరి నిజామాబాద్ ఎంపీ కవిత కూడా నడుస్తున్నారు. అక్కా.. ఆదుకోండి అంటూ అడిగిన వారికి ఆపన్న హస్తం అందజేస్తూ.. అందరి మన్ననలు పొందుతున్నారు.

కవిత ట్విట్టర్‌లో తరచూ పోస్టులు పెడుతుంటారు. తన ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు స్పందిస్తున్నారు. తాజాగా శివ అనే  దివ్యాంగుడు తాను వికలాంగుడినని.. కిరాణ దుకాణం పెట్టుకునేందుకు ఆర్థిక సహాయం చేయండని ఆమెను కోరాడు. ‘ జై తెలంగాణ, జై కేటీఆర్ అన్న, జై కవితక్క ’ అని ట్వీట్ చేశాడు. చేతిపై జై తెలంగాణ అనే అక్షరాలను చూపాడు. ఈ పోస్ట్‌‌ను మంత్రి కేటీఆర్ తన సోదరికి  ట్యాగ్ చేశాడు. ఇది చూసిన కవిత వివరాలు పంపించాలంటూ శివకు ఓ ఫోన్ నంబర్‌ను పోస్ట్ చేశారు. కవిత స్పందించడంతో ఆమె అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.