హనుమజ్జయంతి.. లాఠీచార్జి, అరెస్ట్‌లు - MicTv.in - Telugu News
mictv telugu

హనుమజ్జయంతి.. లాఠీచార్జి, అరెస్ట్‌లు

December 4, 2017

మైసూరు జిల్లా హుణుసూరు పట్టణంలో హనుమజ్జయంతి వేడుకల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. రాళ్ళదాడులు, తోపులాటలు, అరెస్ట్, లాఠీఛార్జ్‌లతో అట్టుడికిపోయింది. హనుమజయంతి సభ్యులు, హిందూ సంఘాల కార్యకర్తలు ఈ ఊరేగింపును మొదలు పెట్టారు. అయితే అనుమతులున్న మార్గంలో కాకుండా వేరే మార్గాల్లో ఊరేగింపు నిర్వహిస్తున్నారని తెలిసి పోలీసులు రంగప్రవేశం చేశారు. హిందూ సంఘాల కార్యకర్తలను, హనుమ జయంతి సమితి సభ్యులను అరెస్ట్ చేసి కే.ఆర్. నగర్ వాల్మీకి సముదాయ భవనానికి తరలించినట్టు జిల్లా ఎస్పీ రవి చెన్నణ్ణవర్ తెలిపారు. ఈ ఊరేగింపులో పాల్గొనడానికి మైసూరు నుంచి వస్తున్న బీజేపీ ఎంపీ ప్రతాప సింహను సైతం అరెస్ట్ చేసి హెచ్.డి. కోట తాలూకాలోని అంతరసంతకు తరలించారు.  ఎంపీ అరెస్టుతో మరింత ఉద్రిక్తత నెలకొన్నది. గురుజంగమ మఠాధీశుడు నటరాజస్వామి నేతృత్వంలో వందలాది మంది హిందూ సంఘాల సభ్యులు, హనుమ భక్తులతో ముడా మాజీ అధ్యక్షుడు నాగేంద్ర, మాజీ మంత్రి విశ్వనాథ్‌ తదితరులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలకు దిగారు. వారు లేకుండా ఊరేగింపు సాగదని తేల్చి చెప్పి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు ఊరేగింపును రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అందరూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. పోలీసులు వారిని చెదరగొట్టడానికి ప్రయత్నించడంతో తోపులాట, రాళ్ళదాడులు, లాఠీఛార్జ్‌,  అరెస్టులు  జరిగాయి.  

సోమవారం హుణుసూరు బంద్‌

హనుమ భక్తులపై పోలీసుల దాడికి వ్యతిరేకంగా సోమవారం హుణుసూరు పట్టణం బంద్‌కు పిలునిచ్చారు జిల్లా ఉపాధ్యక్షుడు మిర్లే శ్రీనివాసగౌడ్. ఇదంతా సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ ప్రభుత్వాల కుట్ర అన్నారు. ఇతర మతాల ఊరేగింపులకు అనుమతులిచ్చి హిందువుల ఊరేగింపులకు అనుమతులివ్వకుండా పోలీసులు ఇలా దాడులకు పాల్పడటం అత్యంత దురదృష్టకర చర్య అన్నారు.