మీసం మెలేస్తున్న ‘మిస్టర్ దళిత్ ’ - MicTv.in - Telugu News
mictv telugu

మీసం మెలేస్తున్న ‘మిస్టర్ దళిత్ ’

October 4, 2017

గుజరాత్‌లో దళితుడు మీసాలు పెద్దగా పెంచాడని  మీద అగ్రవర్ణాల వాళ్లు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనితోపాటు రాష్ట్రంలో  దళితులపై జరుగుతున్న వరుస దాడులకు నిరసనగా వాట్సప్ లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. వాట్సప్‌లో దళితులు తమ ప్రొఫైల్‌ పిక్‌లో మీసాలు, రాజకిరీటం, దాని కింద మిస్టర్‌ దళిత్‌ అని రాసి వున్న ఇమేజెస్‌ పెట్టి వినూత్న నిరసన తెలుపుతున్నారు. ఈ నిరసన కార్యక్రమం ఉనా సంఘటనపై ఉద్యమం నడిపిన దళిత యువకుడు జిగ్నేష్ మెవాని ఆధ్వర్యంలో జరుగుతోంది.

ఈ దాడులకు బాధ్యత వహిస్తూ గుజరాత్‌ హోం మంత్రి వెంటనే రాజీనామా చేయాలని దళితులు డిమాండ్‌ చేస్తున్నారు. దాడులపై పెద్ద ఎత్తున వరుస ఆందోళనలు నిర్వహించేందుకు రాష్ట్రీయ దళిత్‌ అధికార్‌ మంచ్‌ కార్యాచరణను సిద్ధం చేసింది. మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన గుజరాత్‌లో దళితులపై దాడులు అధికార పార్టీకి తీవ్ర ఆటంకంగా మారేలా వుంది.

ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఇలాంటి సంఘటనలు జరగటం గమనార్హం. లింబోదర గ్రామానికి చెందిన యువకుడు దిగంత్‌ మహేరియా(17) స్కూల్‌ నుంచి ఇంటికి వస్తుండగా అతని మీద గుర్తు తెలియని వ్యక్తులు అతని మీద పడి దాడి చేసారు. బ్లేడుతో మెడ, వీపు మీద తీవ్ర గాయాలు చేసారు. వాళ్ళు ముఖాలకు ముసుగులు ధరించి వుండటంతో వారెవరనేది తెలియలేదు. తీవ్ర గాయాల పాలైన మహేరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

గత వారం ఇదే గ్రామానికి చెందిన పీయూష్‌ పర్మార్‌ అనే యువకుడు మీసాలు పెంచుకున్నందుకు ఆగ్రహించిన రాజ్‌పుత్‌ కులస్థులు అతనిపై దాడి చేసి గాయపర్చారు. ఆ ఘటనను మరవక ముందే మళ్లీ అలాంటి దాడి పునరావృతమైంది. అక్కడ దళిత యువకులు పెద్దగా మీసాలు పెంచడాన్ని వారు నేరంగా పరిగణిస్తున్నారు. పీయూష్‌ పర్మార్‌ దిగంత్‌ మహేరియా ఇద్దరూ సోదరులే. పీయూష్‌పై దాడి జరిగినప్పుడు దిగంత్‌ పీయూష్‌తోనే ఉన్నాడు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంలో దిగంత్‌ సోదరుడు కీలక పాత్ర పోషించాడు.

 

ఇది కచ్చితంగా రాజ్‌పుత్ వాళ్ళ పనే అని మహేరియా చిన్నాన్న కిరీట్‌ మహేరియా ఆరోపిస్తున్నాడు. ఇలాంటి సంఘటన గతంలోనూ జరిగింది. అదే  గ్రామానికి చెందిన కృణాల్‌ మహేరియా అనే దళిత యువకుడిపై కూడా రాజ్‌పుత్‌లు దాడి చేసి కొట్టారు. వారం రోజుల్లోనే ముగ్గురు దళితులపై అ్రగవర్ణాలు దాడి చేశారు.