కులోన్మాదం.. కొత్త అల్లుడిని పొడిచి చంపాడు - MicTv.in - Telugu News
mictv telugu

కులోన్మాదం.. కొత్త అల్లుడిని పొడిచి చంపాడు

April 3, 2018

తమ కుటుంబం పరువు కన్నా పిల్లల ప్రేమ ఎంతమాత్రం ముఖ్యం కాదు అనుకుంటున్నారు కొందరు మూర్ఖులు. కన్ కూతురు పెద్దలను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకుంది. అది నచ్చని యువతి తండ్రి అల్లుడి మీద పగతో అతణ్ణి ఇంటికి పిలిచి కత్తితో పొడిచి హత్య చేశాడు. కలకలం రేపుతున్న ఈ ఘటన అనంతపురం జిల్లా నల్లమాడ మండలం  బడవాండ్లపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బడవాండ్లపల్లికి చెందిన గిరిబాబు కుమార్తె భార్గవి అదే గ్రామానికి చెందిన ధనుంజయను ప్రేమించింది. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవటంతో ఇద్దరూ కలిసి ఏడు నెలల క్రితం గ్రామం నుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంటి నుంచి పారిపోయిన వాళ్ళ ఆచూకీ తెలుసుకుంది భార్గవి తల్లి కాటమ్మ.   ‘ జరిగిందేదో జరిగిపోయింది.. మిమ్మల్ని ఏమీ అనం.. ఇంటికి వచ్చేయండి ’ అంటూ ఇటీవల కూతురు, అల్లుడిని ఆహ్వానించింది.తల్లి మాటలు నమ్మిన భార్గవి, ధనుంజయతో కలిసి పది రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. ధనుంజయకు మొదటినుంచి భార్గవి నాన్న మీద అనుమానమే వుండేది. కానీ భార్గవి మాటలు నమ్మి వచ్చాడు.  కూతురి ప్రేమపెళ్లి ఏమాత్రం ఇష్టం లేని భార్గవి తండ్రి.. ధనుంజయపై కోపంతో రగిలిపోతున్నాడు. ఇంట్లో ధనుంజయను కోపంతో చూడటం గమనించిన ధనుంజయ భయపడి కదిరి మండలం కాళసముద్రంలోని అక్క ఇంటికి వెళ్లిపోయాడు. కానీ భార్గవి తన అమ్మానాన్నలు ఏమీ అనరు.. వాళ్ళు మారిపోయారు నువ్వు రా.. అని ధైర్యం చెప్పి ధనుంజయను మళ్ళీ ఇంటికి రప్పించింది. దీంతో రెండు రోజుల క్రితం ధనుంజయ మళ్ళీ అత్తవారింటికి వచ్చాడు.

ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇంట్లో ఉన్న ఈటతో ధనుంజయ గొంతులో పొడిచి దారుణంగా హతమార్చాడు గిరిబాబు. అడ్డుకున్న భార్గవికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం గిరిబాబు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న గిరిబాబు కోసం గాలిస్తున్నారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని ధనుంజయ కుటుంబసభ్యులు కోరుతున్నారు.