7 లక్షల కోట్లతో మెగా హైవే ప్రాజెక్టు  - MicTv.in - Telugu News
mictv telugu

7 లక్షల కోట్లతో మెగా హైవే ప్రాజెక్టు 

October 24, 2017

దేశంలో రానున్న ఐదేళ్లలో దాదాపు రూ 6.9 లక్షల కోట్లతో 83 వేల కిలోమీటర్ల  రోడ్లను అభివృద్ధి చేసే ప్రతిష్టాత్మక  మెగా హైవే ప్లాన్‌కు కేంద్ర కేబినెట్‌ మంగళవారం  ఆమోదం తెలిపింది.  దేశ సరిహద్దులను కలుపుతూ భారత్ మాల ప్రాజెక్టు కింద 28,400 కి.మీ. నిర్మించే ప్రాజెక్టు ఇందులో ఒక భాగం. జాతీయ రహదారుల అభివృద్ది, విస్తరణకు ఉద్దేశించిన భారత్‌మాల ప్రాజెక్టుకూ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 3.5 లక్షల కోట్లతో 40,000 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించడానికి కార్యచరణ చేపట్టింది. 2020 నాటికి  ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు రోడ్ మ్యాప్‌ను రూపొదించారు.

భారత్ మాల ద్వారా సరిహద్దు ప్రాంతాలను కలపడం, అంతర్జాతీయ ఓడరేవులు, తీర ప్రాంతాలకు రోడ్లను కలిపి విస్తరించడం, ఆర్థిక వాణిజ్య హబ్‌లను కలుపుతూ హైవే కారిడార్‌లను అభివృద్ధి చేయడం వంటి పనులను ప్రణాళిక బద్దంగా చేపడతారు. 2022 నాటికి దేశవ్యాప్తంగా 32 కోట్ల  పనిదినాలను కల్పిస్తారు. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సమస్యలను తొలగించి, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తారు.  ప్రభుత్వం ఏటా 10,000 కిలోమీటర్ల రోడ్డును నిర్మిస్తే, ప్రతి సంవత్సరం 4 కోట్ల పని దినాలు వస్తాయి.