నీలోఫర్ ఆసుపత్రిలో ఆందోళన - MicTv.in - Telugu News
mictv telugu

నీలోఫర్ ఆసుపత్రిలో ఆందోళన

April 18, 2018

హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో ఆందోళన వాతావరణం నెలకొంది. మూడు నెలల చిన్నారికి ‘ ఎ ’ పాజిటివ్ రక్తానికి బదులు డాక్టర్లు ‘ ఓ ’ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కించారని చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు.  ఈ విషయం బయటికి చెప్పొద్దంటూ తమను యాజమాన్యం బెదిరిస్తోందని బాలుడి తల్లిదండ్రులు మీడియా ముందు కంటతడి పెట్టారు. బాలుడిది నగరంలోని జియాగూడ అని తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుడి తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

ఈ విషయంపై.. నీలోఫర్ సూపరిండెంట్ లాలూ ప్రసాద్ మాట్లాడుతూ.. వాళ్ళు ఆస్పత్రిపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అన్నారు. ‘ పుట్టినప్పటినుంచి ఆరు నెలల వరకు పిల్లలు ఒకే బ్లడ్ గ్రూపుగా వుండరు. బ్లడ్ గ్రూపు మారుతుంటుంది. చిన్నారి ఆరోగ్యం బాగుంది. ఎటువంటి ప్రాణాపాయం లేదు. అవగాహన లేక బాలుడి తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. ‘ ఓ ’ గ్రూప్ రక్తం విశ్వదాత. అది ఏ గ్రూప్ వారికైనా ఎక్కించొచ్చు ’ అని స్పష్టం చేశారు.