అసైన్డ్ భూములున్న వారికీ కొత్త పాస్ పుస్తకాలు! - MicTv.in - Telugu News
mictv telugu

అసైన్డ్ భూములున్న వారికీ కొత్త పాస్ పుస్తకాలు!

February 23, 2018

కొత్త పాస్ పుస్తకాల పంపిణీపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర పట్టాదారులతో పాటుగానే అసైన్డ్ భూములు కలిగిన వారికి కూడా ఖచ్చితంగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అసలు లబ్దిదారుల స్వాధీనంలో ఉన్న భూములను గుర్తించి, వాటి యాజమాన్యంపై స్పష్టతనివ్వాలని, వారి పేరు మీద పాస్ పుస్తకాలు తయారు చేయాలని ఆదేశించారు.

పాస్ పుస్తకాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రతీ ఎంట్రీని ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎలాంటి తొందరపాటు అవసరం లేదని సిఎం చెప్పారు. వ్యవసాయ భూమి కలిగిన రైతుకు అదే గ్రామంలో వ్యవసాయేతర భూమి ఉంటే, ఆ వివరాలు కూడా పాస్ పుస్తకంలో నమోదు చేయాలని, అందుకోసం అదనపు కాలమ్ పెట్టాలని సిఎం ఆదేశించారు. పాస్ పుస్తకానికి ఆధార్ కార్డు నెంబరు కూడా ఖచ్చితంగా అనుసంధానం చేయాలని చెప్పారు.

మార్చి 11 రోజునే పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ పంపిణీ చేసి తీరాలనే తొందరలో పొరపాట్లు జరగడానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వవద్దని, అసైన్డ్ దారులకు సంబంధించిన పాస్ పుస్తకాల ముద్రణ కూడా పూర్తి కావడంతో పాటు, పాస్ పుస్తకంలో నమోదయ్యే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడానికి కొంత సమయం తీసుకున్నా అభ్యంతరం లేదని సిఎం స్పష్టం చేశారు. భూ రికార్డులకు ఆధార్ కార్డు లింక్ చేయడానికి కొంతమంది ముందుకు రావడం లేదని, ఇప్పటికైనా వారు ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేయించుకోవాలని, లేనట్లయితే అట్టి భూములను బినామీ ఆస్తులుగా గుర్తించాల్సి వస్తుందని సిఎం వెల్లడించారు.

‘‘దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన జరిగింది. ఈ అనేక పీఠముడులున్న ఈ క్షిష్టమైన పనిని రెవెన్యూ అధికార యంత్రాంగం రేయింబవళ్లు ఎంతో శ్రమకోడ్చి విజయవంతం చేశారు. వారికి ప్రత్యేక అభినందనలు. రికార్డుల ప్రక్షాళన తర్వాత వచ్చిన వివరాలన్నీ ధరణి వెబ్ సైట్ లో నమోదు చేసే పని జరుగుతున్నది. ఆ వివరాల ఆధారంగా కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించాం.

స్వంత భూమి కలిగిన రైతులతో పాటు ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూమిని సాగు చేసుకుంటున్న రైతుల వివరాలు కూడా సేకరించాలి. వారికి కూడా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఇందుకోసం కొంత సమయం పడుతుంది. అయినా ఫర్వాలేదు. కలెక్టర్లతో మాట్లాడి ఖచ్చితమైన వివరాలు తెప్పించాలి. అసైన్డ్ దారులకు కూడా భూమి యాజమాన్య హక్కులపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. పాస్ పుస్తకాల్లో నమోదయ్యే వివరాలను ఒకటి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించాలి.

తొందరపాటులో పొరపాట్లు దొర్లే అవకాశం ఉంది. మార్చి 11ననే పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించిన మాట నిజం. అయితే అసైన్డ్ భూముల యజమానులను గుర్తించడం, వివరాలను పరిశీలించడం, వ్యవసాయేతర భూముల వివరాలు కూడా నమోదు చేయడం లాంటి పనులన్నీ చేయడానికి కొంత సమయం పడుతుంది. పాస్ పుస్తకాల తయారీ పక్కాగా జరిగిన తర్వాతే పంపిణీ కార్యక్రమం చేపట్టాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.