మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైన ఉన్న అభిమానంతో చాలా మంది చాలా పనులు చేస్తుంటారు. కొందరు అన్నదానం, కొందరు రక్తదానం చేస్తుంటారు. కానీ ఓ అమ్మాయి మాత్రం మరో అడుగు ముందుకేసింది. ఓ యువకుడి చరిత్ర ఏమీ తెలుసుకోకుండా అతడు కేవలం మోదీ అభిమాని అనే కారణంతో పెళ్లాడి చిక్కుల్లో పడింది.
అతడు తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె పేరు అల్పికా పాండే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. గుజరాత్‌కు చెందిన జయ్ దవే అనే యువకుడు గతేడాది కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను అల్పిక లైకింది. అప్పటి నుంచి వీరద్దరి మధ్య సోషల్ మీడియాలో స్నేహం మొదలైంది. మోదీ అంటే ఇద్దరికి విపరీతమైన అభిమానం. ఆలోచనలు కలిశాయి. అభిమాన నాయకుడూ ఒక్కరే కాబట్టి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గతేడాది డిసెంబర్ 31న ‘మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నాం. మేం ఇద్దరం మోదీకి మద్దతు తెలుపుతున్నాం. మేమిద్దరం దేశం కోసం బతకాలనుకుంటున్నాం.. అందుకే కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాం’ అంటూ జయ్ దవే చేసిన ట్వీట్ వైరల్ అయింది.
ఆ తరువాత 2019, జనవరిలో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లైన నెల రోజులకే వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. తాను పడుతున్న బాధల గురించి అల్పిక ట్వీట్ చేశారు. ‘నరేంద్ర మోదీపైన ఉన్న అభిమానంతో సోషల్ మీడియాలో పరిచయమైన జయ్ దవేను వివాహం చేసుకున్న అమ్మాయిని నేనే. అయితే ఈ బంధంలోని మరో కోణం గురించి కూడా మీకు తెలియాలి. నా భర్త నన్ను శారీరకంగా, మానసికంగా చాలా హింసిస్తున్నాడు. ఈ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను’ అంటూ వాపోయింది. అంతేకాక ‘జయ్ దవేకి నా మీద చాలా అనుమానం. ప్రతీక్షణం నేను ఏం చేస్తున్నానే విషయం అతనికి తెలియాలి. నాకు తెలియకుండా నా ఫోన్‌ని చెక్ చేసేవాడు. నా వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ ఇవ్వడు. నేను ఒంటరిగా బయటకు వెళ్లడానికి కూడా వీల్లేదు. గౌరవం పేరుతో ఎవర్నో ఒకర్ని నాకు తోడుగా పంపిస్తాడు. నన్ను బాధ పెట్టే విషయంలో అతని కుటుంబసభ్యులు కూడా అతనికే మద్దతు ఇస్తారు’ అంటూ ట్వీట్ చేసింది.
ఈ హింస తట్టుకోలేక జయ్ దవే ఇంటి నుంచి బయటకు వచ్చేశానని.. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది అల్పిక. అంతేకాక పెళ్లి చేసుకోవాల్సిందిగా జయ్ దవేనే తనను బలవంత పెట్టాడని ఆరోపించింది.
Here's the other side of the story that you have been hearing about @thejaydave who met a girl on @facebook who liked one of his comments on @RahulGandhi's page. They fell in love and got together as they both supported @narendramodi. Well, I am that girl. pic.twitter.com/btT07flSd0
— Alpika Pandey (@AlpikaPandey) February 2, 2019