'రెండు తలల‘ పాముతో అదృష్టం లేదు,అరిష్టం లేదు ! - MicTv.in - Telugu News
mictv telugu

‘రెండు తలల‘ పాముతో అదృష్టం లేదు,అరిష్టం లేదు !

February 16, 2018

మీ దగ్గర రెండు తలల పాము ఉందా? అది మీఇంట్లో ఉంటే గుప్తనిధులు వస్తాయని అనుకుంటున్నారా?పనీ పాట వదిలేసి  పొద్దు,మాపు దానికి తిండి పెడుతూ కంటికి రెప్పలా కాపాడుతున్నారా? అట్లైతే మీ పని ఆశకు ఊశిగాడు సచ్చిండనే  కథనే అయితది.

రెండు తలల పాములను పెంచుకుంటే  లక్ష్మీ దేవి మనింట్లకు కాళ్లకు గిర్కలు కట్టుకుని ఉరుక్కుంట వస్తది..ఉన్న దరిద్రాలు వోతయ్, సకల సుఖ సంతోషాలతో వర్థిల్లుతారు.. ఇట్ల పిట్టకథలు ఎన్ని పుట్టిచ్చి జెప్పిన్రో అన్ని బుస్సు మన్న కథలు గాదు మొత్తం గుడ తుస్సుమన్న కథలే అయినయ్. కోట్లు వస్తయని లక్షలు పెట్టి కొనుక్కొని పెంచుకుంటే  వాటికి మీదికేలి తిండిగుడ దండుగే అని తేలింది.

లెక్కకైతే పాముకు రెండు తలలే ఉండవట…ఏదైతే రెండుతలల పాము(రెడ్ సాండ్ బో) అని పిలవబడుతుందో దాని తోక గుడ పాము తలను పోలీ ఉంటుంది. దాన్ని జూశే అందరూ రెండు తలల పాము రెండు తలల పాము అని  విచిత్రంగా సూస్తరు.

ఇప్పటివరకు ఈ పాముల మీద కోట్ల రూపాల బిజినెస్లే జరిగినయ్. గుప్తనిధులు దొర్కుతయ్, గుట్టల కమాన పైసలు వస్తయ్ అంటూ బద్మాష్ గాళ్లు పబ్లిక్‌ను  మోసం జేస్కుంట బాగానే ఎన్కేస్కున్నరు. అయితే రెండుతలల పాముపై జరుగుతున్న మోసాల గురించి అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఎవ్వరూ కూడా రెండు తలల పాముతో గుప్తనిధుల వస్తాయంటే నమ్మెద్దని అటువంటిదేమీ లేదని, విషపూరితం కాని ఈపాము తల, తోక ఒకేలా ఉంటాయని అంతేకాని రెండు తలలు ఉండవని స్పష్టం చేశారు.

ఇకముందు రెండు తలల పాము, వాటి అమ్మకం, అతీంద్రీయ శక్తులు అని ఎవరైనా ప్రచారం చేస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1800 4255 364 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51 కింద అటువంటి నేరాలకు మూడేళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశముందన్నారు.

ఈ పాములను అక్రమంగా కలిగి ఉండటం, రవాణా చేయటం, స్మగ్లింగ్ చేయటం లాంటివి నేరమని అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. వీటిని రవాణా చేసేవారు, ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టేవారు డబుల్ ఇంజన్ అనే కోడ్ ను కూడా వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. మూడున్నర కేజీలు ఆపై బరువు ఉండే పాములు మరింత లబ్దిచేస్తాయని నమ్మించే ప్రయత్నం చేస్తారని తెలిపారు.  రెండు తలల పాము, దాని శక్తుల పేరుతో జరిగే ప్రచారం పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.