మెట్రోకు వెళ్తున్నవారి  బైకులు మాయం! - MicTv.in - Telugu News
mictv telugu

మెట్రోకు వెళ్తున్నవారి  బైకులు మాయం!

November 30, 2017

సరదాగా కొత్త మెట్రో రైలను చూసొద్దామని బైకులు కింద పార్క్ చేసి వెళ్తున్నవారి వాహనాలు వాళ్ళు తిరిగొచ్చేసరికి మాయమవుతున్నాయి. ఇదేదో దొంగలు చేసిన పని కాదు, ట్రాఫిక్ పోలీసుల పనే. మెట్రో స్టేషన్ల కింద అక్రమంగా పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను సమీప స్టేషన్లకు తరలిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. మెట్రో స్టేషన్లలో అన్నీ హంగులనూ తీర్చి దిద్దారు కానీ పార్కింగ్ గురించి అస్సలు ఆలోచించినట్టు లేదు. చాలా మంది ప్రయాణీకులు ఉప్పల్ నుండి అమీర్ పేట్‌కు బైకు మీద ఎందుకు వెళ్ళడం.. మెట్రో స్టేషన్‌లో బైకు పార్క్ చేసి వెళదాం అనుకుని ఆ పని చేసి వెళ్తున్నారు.కానీ వారు తిరిగొచ్చి చూసేసరికి వారి బైకులు వుండట్లేదు.  బైకులు అలా అనధికారంగా పార్క్ చేయటం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు వాటిని అక్కడినుండి తొలగిస్తున్నారు. మా బైకులు పోయాయని చాలా మంది స్టేషన్ సిబ్బందితో వాదనలకు దిగుతున్నారు. ముఖ్యంగా అమీర్ పేట, బేగంపేట, ఎస్ ఆర్ నగర్ స్టేషన్లలో ఈ సమస్య అధికంగా ఉంది. ఇప్పటివరకు 100 కు పైగా బైకులను తరలించాల్సి వచ్చిందని, వాటిపై ఎలాంటి జరిమానాలు విధించకుండా అప్పగిస్తామంటున్నారు పోలీస్ అధికారులు. ఈ సందర్భంగా మెట్రో స్టేషన్లలో తప్పనిసరి పార్కింగ్ ఏర్పాట్లు చేయాలంటున్నారు ప్రయాణీకులు.