ఇక ‘లక్ష్మీస్ వీరగ్రంథం’  - MicTv.in - Telugu News
mictv telugu

ఇక ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ 

October 25, 2017

ఓ పక్క రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా మొదలు పెడతానని చెప్పి రిలీజ్‌కు ముందే విపరీతమైన పబ్లిసిటీ చేస్తున్నాడు. తాజాగా లక్ష్మీపార్వతి జీవితంలోని వేరే కోణాన్ని ఆవిష్కరించే సినిమా ఒకటి రానుంది. ఆ సినిమా పేరు ‘ లక్ష్మీస్ వీరగ్రంథం’. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోంది ఈ సినిమా

ఈ సినిమాలో ప్రధానంగా లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ జీవితంలోకి రాక మునుపు ఆమె రామగంథం సుబ్బారావుకు భార్య అవడం..  ఆ తర్వాత కొంత కాలానికి విడిపోయి సూటుకేసుతో బయటకు రావడం వంటి సంఘటనలను ఇతివృత్తంగా చేసుకొని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన తీరును కూడా ఈ సినిమాలో చూపించనున్నట్టు జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ చిత్రంలో మూడు పాటలు, ఒక హరికథ కూడా వుంటుందట.

లక్ష్మీపార్వతి పాత్ర కోసం వాణి విశ్వనాథ్‌ను, లక్ష్మీరాయ్, పార్వతీ మెల్టన్‌ను దర్శకుడు సంప్రదించాడట. నవంబర్ రెండో వారం నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతారట. తిరుపతిలో పరిసర ప్రాంతాల్లో ఎక్కువ శాతం షూటింగ్ చేసి 2018 లో సినిమాను విడుదల చేసే ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం.

మొత్తానికి లక్ష్మీ పార్వతి కథ ఇన్నాళ్లుకు తెలుగు సినిమావాళ్ల దృష్టికి రావడం.. అదీ ఆమె పేరుతోనే సినిమాలు తీయడం వెనుక పక్కా రాజకీయ కారణాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. వర్మ టీడీపీకి వ్యతిరేకంగా, లక్ష్మీపార్వతిని హైలెట్ చేస్తూ సినిమా తీస్తారని అంచనా.