ఒబామాదే టాప్ ట్వీట్..  46 లక్షల లైకులు - MicTv.in - Telugu News
mictv telugu

ఒబామాదే టాప్ ట్వీట్..  46 లక్షల లైకులు

December 6, 2017

గమ్యాన్ని ముద్దాడాలంటే దాని వెనకాల మనం దాన్ని అనుసరిస్తూ వెళ్ళాలి. కానీ సోషల్ మీడియా వచ్చాక మన మంచి రాతలతో చాలా మందిని మనలను ఫాలో అయ్యేలా చేసుకోవచ్చు. అది అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్  ఒబామాను చూసి నేర్చుకోవలసిందే.

పాపులర్ ట్వీట్లు చేసిన జాబితాలో ఒబామా ముందు వరసలో వున్నారు. ఈ ఏడాది ఎక్కువమంది ఇష్టపడిన ట్వీట్ ఒబామా చేసిందేనని ట్విట్టర్ వెల్లడించింది. కాగా ట్విటర్‌లో అత్యధిక మంది అనుసరిస్తున్న వారిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే పాపులర్ ట్వీట్ల విషయంలో మాత్రం ఒబామాను దాటిపోలేకపోయారు.

ఏదైనా సంఘటనలు సంభవించినప్పుడు దానికి అనుగుణంగా అప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా స్పందించడం ఒబామాకు బాగా ఒంట బట్టినట్టున్నది. ఈ ఏడాది ఆగస్టులో వర్జీనియాలోని ఛార్లెట్స్‌విల్లేలో పెద్దఎత్తున జాతివిద్వేష ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు ఒబామా తన వ్యక్తిగత ట్విటర్‌ ద్వారా ఓ పోస్టు చేశారు. నెల్సన్‌ మండేలా సూక్తుల్లో ఒకటైన ‘ మతం, శరీరఛాయ, నేపథ్యాల కారణంగా ఎవరూ మరొకరిని ధ్వేషించరు ’ అంటూ ఒబామా ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్ చాలా మందిని ఆకట్టుకున్నది. 4.6 మిలియన్ల లైక్‌లు, ఎక్కువ మంది రీట్వీట్‌లు చేసిన జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. అంతేగాకుండా ఈ ఏడాది ఎక్కువ మంది ఇష్టపడిన ట్వీట్‌గా తొలిస్థానంలో నిలిచింది.  అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినా సోషల్ మీడియాలో ఒబామా చరిష్మా తగ్గలేదనడానికి ఈ ట్వీటే నిదర్శనం.