ఇతను పేపర్ల పురుగు ! - MicTv.in - Telugu News
mictv telugu

ఇతను పేపర్ల పురుగు !

February 21, 2018

చాలా మందికి  పాత నాణేలు,స్టాంపులు రకరకాల పురాతన వస్తువులను సేకరించడం అలవాటుగా ఉంటుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం అందరికంటే భిన్నంగా వార్త పత్రికలను సేకరించి రికార్డు సాధించాడు. ఒడిశాలోని జాబ్ పూర్ జిల్లా అరంగాబాద్‌కు చెందిన శశాంకదశ్ దేశ ,విదేశాలకు చెందిన వార్త పత్రికలను సేకరించి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.

ఆయన వద్ద దాదాపు 3,333 పత్రికలు ఉన్నాయి. వీటిల్లో 61 భాషలు, 68 దేశాలకు చెందిన పత్రికలు ఉన్నాయి. అంతేకాదు శశాంక వద్ద 2012 జనవరి 26వ తేదీ నాటి 392 పత్రికలు ఉండడం విశేషం. పత్రికల సేకరణలో లిమ్మాబుక్ లో చోటు సంపాందించిన శశాంక గిన్నిస్ బుక్ రికార్డు కోసం కూడా దరఖాస్తు చేసుకున్నాడు. గతంలో ఆయన జర్నలిస్ట్‌, రచయితగా కూడా పని చేశారు.పేపర్ల సేకరణ కారణంగా అంతా ఆయనను ‘పేపర్‌ బాయ్‌’ అని అంటారు.

‘నేను విదేశాల పేపర్త కోసం వివిధ దేశాలకు చెందిన ఎడిటర్లకు ఈమెయిల్‌ ద్వారా పేపర్స్‌ కావాలని కోరుతాను. కొన్ని సార్లు వారి ఫోన్ నంబర్లు కనుక్కొని  మరీ ఫోన్‌ చేసి అడుగుతాను . కొందరు నా అభ్యర్థనలకు స్పందించి తమ పత్రికల కాపీలను పంపిస్తారు. కొందరు మాత్రం ఏమాత్రం స్పందించరు. మరికొన్ని పత్రికలను ఇతర ప్రాంతాల్లో తనకు తెలిసిన వారి ద్వారా తెప్పించుకుంటాను, నా అలవాటును చాలా మంది ఎడిటర్లు ప్రోత్సహించారు

ఈ పత్రికలను ప్రదర్శించడానికి నా ఇంటిలో కొంత భాగాన్ని చిన్న సైజు మ్యూజియంగా మార్చేశాను. ఈ న్యూస్‌పేపర్లతో నా  తండ్రి పేరుమీద మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను.  ఈ ప్రతికలను భారత్‌తో పాటు అమెరికా, యూకే సహా పలు దేశాల్లో ప్రదర్శించాలని కోరుతున్నానని’ శశాంక తెలిపారు.