హైదరాబాద్ మెట్రో, ఓలా చేతులు కలిపాయి - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ మెట్రో, ఓలా చేతులు కలిపాయి

December 13, 2017

మెట్రో ప్రాజెక్టును నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థతో ఓలా క్యాబ్స్ ఓ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు చెందిన ‘ టీసవారి ‘ (TSavaari) యాప్ తో ఓలా అనుసంధానమైంది. ఈ యాప్‌లో మెట్రో మనీతో పాటు ఓలా సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా ప్రయాణికులు తమ స్మార్ట్ కార్డులను ఓలా మనీ వ్యాలెట్‌‌తో రీచార్జ్ చేసుకోవచ్చు.ఈ సందర్భంగా ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సీఈవో అనిల్ కుమార్ శైనీ మాట్లాడుతూ.. ఓలాతో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందని, ఈ సదుపాయం వల్ల ప్రయాణికుల స్టేషన్‌కు రాకపోకలు చాలా ఈజీగా వుంటాయని చెప్పారు.  ఇక నుంచి మెట్రో స్టేషన్లకు వెళ్ళాలన్నా, రావాలన్నా ఓలా క్యాబులు అందుబాటులో వుంటాయి. నగర వాసులకు మెట్రో ప్రయాణం సౌకర్యవంతంగా వున్నా, అక్కడి రాకపోకలపై సరైన సదుపాయాలు లేవు. పైగా అక్కడికి బైకుల మీద, కార్లలో వచ్చేవారికి పార్కింగ్ సమస్య చాలా వుంది. కొన్ని మెట్రో స్టేషన్లకు ఆర్టీసీ బస్సులు వేశారు. ఇలాంటి ఇబ్బందుల దృష్ట్యా ఓలా మెట్రోతో చేతులు కలిపినట్టు తెలుస్తున్నది.

టీసవారి యాప్ నుంచి ఓలా క్యాబ్, ఓలా ఆటోలను డైరెక్ట్‌గా బుక్ చేసుకోవచ్చు. ఒప్పందంలో భాగంగా మెట్రో స్టేషన్లలోని ఓలా కియోస్క్‌ల వద్ద ఆ సంస్థ ప్రతినిధులు ఉండబోతున్నారు. ఓలా క్యాబ్‌లను బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణికులకు వీరు సహకరిస్తారు. క్యాబ్‌ను బుక్ చేసుకున్న రెండు నిమిషాల్లోనే క్యాబ్ వచ్చేలా ఏర్పాటు చేశారు.