కేసీఆర్‌పై 2, బాబుపై 3.. సీఎంలపై క్రిమినల్ కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌పై 2, బాబుపై 3.. సీఎంలపై క్రిమినల్ కేసులు

February 13, 2018

దేశంలోని 11 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, మిగతా 20 మందిపై ఎటువంటి కేసులూ లేవని  అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (  ఏడీఆర్ ) పేర్కొంది. వివిధ రాష్ట్రాల సీఎంలు, వారి ఆస్తులు, వారిపై ఉన్న కేసులతో కూడిన సమగ్ర నివేదికను ఏడీఆర్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల సీఎంలలో కేసీఆర్‌పై 2 కేసులుండగా, వాటిల్లో ఒకటి తీవ్రమైన కేసు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం, వరంగల్ జేఎఫ్‌సీఎం కోర్టు ఒకటో అదనపు జడ్జి ముందు 2013 మార్చి 14న దాఖలైన కేసు విచారణ దశలో ఉంది.

దీంతో పాటు ఐపీసీ సెక్షన్ 147, 117, 151, 188, 341, 353, 506, 149 సెక్షన్ల కింద సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసులో ఆయనపై అభియోగాలు మోపబడ్డాయి. అధికారుల పనిని అడ్డుకోవడం, ప్రజలకు ఇబ్బందులు కలిగేలా నిరసనలు తెలపడం, చట్ట విరుద్ధంగా ప్రవర్తించడం, హింసకు ప్రోత్సహించడం, ఐదుగురు అంతకన్నా ఎక్కువ మందితో కలసి నిషేధాజ్ఞలు ఉల్లంఘించడం వంటి ఆరోపణలు ఉన్నాయి.

ఇదిలా వుండగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడిపై 3 సాధారణ నేరారోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ దశలో ఉన్న ఈ మూడు కేసులపైనా స్టే విధించింది. ఆయనపై నాంపల్లి కోర్టులో ఒకటి, ఆదిలాబాద్ కోర్టులో ఒకటి, బొబ్బిలి కోర్టులో ఒక కేసు నమోదై ఉన్నాయి. కోర్టు స్టే విధించి ఉండటంవల్ల ఆయనపై ఉన్న అభియోగాల వివరాలను ఏడీఆర్ వెల్లడించలేదు. 

కాగా వీరితోపాటు క్రిమినల్ కేసులున్నవారిలో 8 మంది తీవ్రమైన నేరారోపణలు కలిగివున్నారని వెల్లడించింది. ఈ జాబితాలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌పై 22 కేసులుండగా, వాటిల్లో 3 తీవ్రమైన నేరారోపణలు. ఇక రెండో స్థానంలో ఉన్న కేరళ సీఎం పినరయి విజయన్‌పై 11 కేసులుండగా, వాటిల్లో ఒకటి తీవ్రమైన నేరంగా పరిగణించింది ఏడీఆర్.