mictv telugu

మోదీ పాల్గొన్న కార్యక్రమంలో ఘోరం.. మహిళా మంత్రిని

February 12, 2019

ప్రధానమంత్రి పాల్గొన్న ఓ కార్యక్రమంలో స్టేజిపైనే తోటి మహిళా మంత్రితో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ మంత్రి. త్రిపుర రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ దారుణమైన సంఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది. ప్రధాని మోదీ గత శనివారం అగర్తలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌తో పాటు కొందరు రాష్ట్ర మంత్రులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ఓ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మనోజ్‌ కాంతి దేవ్‌ తన పక్కనే నిల్చున్న తోటి మహిళా మంత్రిని అసభ్యంగా తాకాడు.

ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మనోజ్‌ కాంతి దేవ్‌ను వెంటనే తొలగించాలంటూ ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే దీనిపై మనోజ్‌ను ప్రశ్నించగా.. ఘటనపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. కాగా.. భాజపా మాత్రం ఘటనను తోసిపుచ్చింది. ప్రభుత్వానికి మచ్చ తెచ్చేందుకు ప్రతిపక్ష నేతలు ఇలా బీజేపీ మంత్రులపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ ప్రతినిధి అన్నారు. ఆ వీడియో అంతా బూటకమని కొట్టిపారేశారు. ఇదిలా ఉండగా ఘటనపై సదరు మహిళా మంత్రి నుంచి కూడా ఎటువంటి ఫిర్యాదు రాలేదు.Telugu News On Stage With PM Modi Tripura Minister Groped Colleague Video Shows