దేశంలో అత్యంత సంపన్న ఎంపీ ఇతనే - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో అత్యంత సంపన్న ఎంపీ ఇతనే

March 14, 2018

దేశంలో అత్యంత సంపన్న ఎంపీ ఎవరంటే ఇకనుంచి ఈయన పేరే చెప్పుకుంటారు. బీహార్‌కు చెందిన మహేంద్ర ప్రసాద్‌ అలియాస్‌ కింగ్‌ మహేంద్ర ఆస్తి వందల కోట్లు కాదు.. అక్షరాలా రూ.4వేల కోట్లు. నిన్నటి వరకు అందరూ జయాబచ్చన్ సంపన్నురాలని అనుకున్నారు. కానీ ఈయన ఆమెను మించిపోయాడు.

బిహార్‌లో రాజ్య సభకు జేడీయూ అభ్యర్థిగా ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. అందులో రూ.4వేల కోట్ల ఆస్తులను ప్రకటించారు. దీంతో మహేంద్ర దేశంలో అత్యంత సంపన్న ఎంపీ కానున్నారు. ఆయన ఏడోసారి పార్లమెంటులో ప్రవేశించేందుకు సిద్ధమయ్యారు. జేడీయూ నుంచి పోటీ చేయడం ఇది మూడోసారి. ఇంతటి సంపన్న వ్యక్తి అయిన మహేంద్ర పేరుమీద వాహనాలు గానీ బీమా పాలసీలు గానీ లేకపోవడం గమనార్హం.

ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో స్థిరాస్తులను రూ.29.1కోట్లుగా,  చరాస్తులు రూ.4,010.21కోట్లుగా ప్రకటించారు. ఆయనకు రెండు ఫార్మా కంపెనీలు ఉన్నాయి. మాప్రా లాబరేటరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అరిస్టో ఫార్మాస్యుటికల్స్‌. వీటికి సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో టర్మ్‌ డిపాజిట్లు రూ.2,239కోట్లు ఉన్నట్లు తెలిపారు. రూ.41లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆదాయపన్ను రిటర్న్స్‌లో ఆయన 2016-17 ఆర్థిక సంవత్సరానికి తన ఆదాయాన్ని రూ.303.5కోట్లుగా ప్రకటించారు.

మహేంద్ర తొలిసారిగా 1980లో పార్లమెంటులో అడుగుపెట్టారు. కాంగ్రెస్‌ నుంచి జెహానాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి మొదటిసారి గెలుపొందారు. 1985 నుంచి కాంగ్రెస్‌, ఆర్జేడీ, జేడీయూల నుంచి పోటీ చేసి ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా ఆయనకు అత్యధిక దేశాలు పర్యటించిన ఎంపీగా కూడా పేరు ఉంది. ఆయన మొత్తం 211 దేశాలు సందర్శించారు.